
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు పర్చూరు మార్కెట్ యార్డులోని పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శన
పర్చూరు(చినగంజాం): పొగాకు రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం రైతులందరినీ ఆదుకుంటుందని ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. పర్చూరు మార్కెట్ యార్డు పరిధిలోని నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. గోదాముల్లో నిలువ ఉంచిన పొగాకు పరిశీలించారు. పొగాకు రైతులకు బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకును కొనుగోలు చేస్తోందన్నారు. పొగాకు నాణ్యతను బట్టి మూడు గ్రేడులుగా విభజించి రైతులకు గిట్టుబాటు ధలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 7754 మంది రైతుల వద్ద మార్క్‌ఫెడ్ సంస్థ సుమారు రూ.100 కోట్లతో 13100 మెట్రిక్ టన్నులు పొగాకు కొనుగోలు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీ మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సీహెచ్ స్రీనివాసరావు, జిల్లా మేనేజర్‌లు నరసింహ, రమేష, పర్చూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుంజి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.