
మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా
రేపల్లె: రేపల్లె పట్టణంలో అధిక వడ్డీలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్న మైక్రోఫైనానన్స్ సంస్థల నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మైక్రో ఫైనానన్స్ సంస్థ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్ ఫైనానన్స్ సంస్థలు ఇళ్ల పట్టాల మీద లోన్ ఇస్తామని పేదలను నమ్మించి ఇంగ్లీషులో ఉన్న అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేయించుకొని అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని విమర్శించారు. 12 శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ 30 శాతం వరకు వసూలు చేస్తూ పేదలను పీడిస్తున్నారన్నారు. రాత్రి ఆరు గంటల తర్వాత లోన్ రికవరీ పేరుతో మహిళలకు ఫోన్ చేసి వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాధిత మహిళలు సింధు దేవి, తిరుపతమ్మ, కృష్ణంరాజు, దుర్గాప్రసాద్, మోషే, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.