అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తా..
కారంచేడు: అధిక లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంతో తప్పించుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ పెనుప్రమాదం తప్పిందనే చెప్పాలి. సోమవారం ఉదయం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలోని కారంచేడు–చీరాల మధ్యన జరిగిన ఈ ప్రమాదంలో చీరాల వైపు నుంచి పర్చూరు వైపునకు వేరుశనగ కాయల లోడుతో వేగంగా వస్తున్న ఈ ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో రోడ్డుపై వేరుశనగ కాయల బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలచిపోయింది. స్థానిక ఎస్‌ఐ వీ వెంకట్రావు సంఘటనా స్థలానికి తన సిబ్బందిని పంపి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ప్రమాదం సమయంలో ద్విచక్రవాహనాలు, ఆటోలు రాకపోవడంతోపాటు, కాలువ వైపు కాకుండా మరోక వైపు పడిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. అధిక లోడు కారణంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు.


