నిర్బంధంలోనూ వైఎస్సార్సీపీ గెలుపు...
సాక్షి, మదనపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆకాశమే హద్దుగా కూటమి ప్రభుత్వం అక్రమాలకు..అరాచకాలకు తెరతీసింది.. విచ్చలవిడిగా దౌర్జన్యకాండ చేసింది. చాలాచోట్ల నామినేషన్లే వేయనీయకుండా ఏకగ్రీవాలు చేసుకుంది. ఇక కౌంటింగ్ రోజూ అధికారులపై ఒత్తిడి తెచ్చి గెలుపోటములను తారుమారు చేసింది. ఇన్ని చేసినా అక్కడక్కడ పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో ‘ఫ్యాన్’హవా నడిచింది. ప్రజల్లో జననేత వైఎస్ జగన్‌పై అభిమానం చెక్కుచెదరలేని ఈ ఎన్నికల ద్వారా రుజువైంది. వెరసి వైఎస్సార్సీపీ ‘ఫ్యాన్’లో జోష్ పెరిగింది.
● జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్ఆర్సీపీ మరో రెండు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. శనివారం మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగిన విషయం తెలిసిందే. బి.కొత్తకోట, మదనపల్లె జెడ్పీటీసీకి సంబంధించి ఆరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి దాటేవరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఈ ఓట్ల లెక్కింపులో మదనపల్లె వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జన్నే కిరణ్మయి, బి.కొత్తకోట అభ్యర్థి ఎర్రమద్దు లక్ష్మీదేవి విజయం సాధించారు. వీరి ఎన్నికను జీర్ణించుకోలేని కూటమి నేతలు .. అధికారులపై ఒత్తిడి తెచ్చి గెలుపు ప్రకటనను ఆలస్యం చేశారు. ఎట్టకేలకు అర్థరాత్రి దాటిన తర్వాత మదనపల్లె అభ్యర్థి జన్నే కిరణ్మయి 1,326 ఓట్ల మెజార్టీతో, బి.కొత్తకోట అభ్యర్థి లక్ష్మీదేవి 1,588 ఓట్ల మెజార్టీతో గెలిచారని ప్రకటించారు. దాంతో జిల్లాలో బి.కొత్తకోట, మదనపల్లె, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, సదుం, నిమ్మనపల్లె జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. వీటిలో పెద్దమండ్యం జెడ్పీటీసీ ఆవుల మల్లికార్జునరెడ్డి 4,359 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. నిమ్మనపల్లె, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, సదుం మండల పరిషత్‌లను వైఎస్సార్సీపీ దక్కించుకుంది.
ఎంపీటీసీ స్థానాల్లో జోష్
జిల్లాలో 169 ఎంపీటీసీ స్థానాలను అధికార కూటమి అరాచకాలతో దక్కించుకుంది. ఎన్నికలు జరిగిన 147 స్థానాల్లో వైఎస్సార్సీపీ 69 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అధికార దౌర్జన్యంతో.. అరాచకాలు చేసినా టీడీపీ 68 స్థానాల్లో గెలుపొందింది. ఇక జనసేన ఆరు, బీజేపీ 2, స్వతంత్రులు రెండు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. ఎన్నికలు జరిగిన స్థానాల్లో అత్యధికంగా వైఎస్సార్సీపీ దక్కించుకోవడం విశేషం.
వీటిని ఎన్నికలంటారా!
జిల్లాలో కూటమి సాగించిన దౌర్జన్యకాండ ఎలాంటిదో గాలివీడు, చిన్నమండెం ఎన్నికలే ఉదాహరణ. దౌర్జన్యంగా గాలివీడు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరింపజేయడంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసాద్ ప్రత్యర్థి లేకుండానే గెలుపొందారు. ఆయనకు 30,300 ఓట్లు వస్తే అందులో 29,825 మెజార్టీ అంటేనే అక్కడ ఎన్నిక తీరు అర్థం అవుతుంది.
● చిన్నమండెంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవనాథ్ రెడ్డిని వేధింపులు గురి చేయగా.. ఆయన ఎన్నికలనే బహిష్కరించారు. ప్రత్యర్థి లేకనే టీడీపీ అభ్యర్థి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి 20,293 ఓట్లు సాధిస్తే అందులో ఆయన మెజార్టీ 19,728. సంబేపల్లి, చౌడేపల్లి, కలికిరి, వాయల్పాడు ఇలా చాలా మండలాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్ లేకుండా ఏకపక్షంగా కూటమి రిగ్గింగ్ చేసుకుంది.
జిల్లాలో ఎంపీటీసీగా కూటమి గెలిచిన చోట అతి తక్కువ ఓట్లే మెజార్టీయే వచ్చింది. మందలవారిపల్లెకు చెందిన బీజేపీ అభ్యర్థి శాంతమ్మ తొమ్మిది ఓట్లతో, మడుమూరుకు చెందిన టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు 10 ఓట్లతో, వనమల దీన్నెకు చెందిన టీడీపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ 19 ఓట్లతో, రామాచార్లపల్లె–1లో టీడీపీ అభ్యర్థి శారద 14 ఓట్లతో, సీటీఎం క్రాస్ రోడ్–1,2 టీడీపీ అభ్యర్థులు 15, 21 ఓట్లతో, ఎరబ్రెల్లి టీడీపీ అభ్యర్థి అమరావతి 9 ఓట్లతో, కుదురుచీమనపల్లె టీడీపీ అభ్యర్థి వనజ 22 ఓట్లతో గెలుపొందగా, 25 ఓట్ల లోపు గెలిచినవారు చాలామంది ఉన్నారు. కాగా గెలిచిన చోట వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. కన్నెమడుగు ఎంపీటీసీ అభ్యర్థి దేవరింటి లీలావతి 1,083 ఓట్ల మెజార్టీతో, యర్రాతివారిపల్లె అభ్యర్థి 1,151, కలిచర్ల అభ్యర్థి పద్మావతి 1,008, నిమ్మనపల్లె అభ్యర్థి దావూద్ ఖాన్ 1,026 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 500పైబడిన మెజార్టీ వచ్చిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు.
జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పరిశీలిస్తే టీడీపీ అధికారం అండతో ఏకపక్షంగా పదవులను దక్కించుకుంది. నామినేషన్లు ఉపసంహరింప చేయడం, ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా చేయడం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం లాంటి చర్యలకు పాల్గొనడం ద్వారా జిల్లా పరిషత్ దక్కించుకుంటోంది. ప్రజాస్వామ్యబద్ధంగా టీడీపీ ఎన్నికల్లో పాల్గొని ఉంటే ఆ ఫలితాలు వేరుగా ఉండేవి. 169 ఎంపీటీసీ స్థానాలను ప్రతిపక్ష పార్టీల నామినేషన్లు వేయకుండా అడ్డుకొని ఏకగ్రీవం చేసుకుంది. ఇవే 147 ఎంపిటిసి స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి పరాభవం తప్పలేదు. వైఎస్సార్సీపీకి 69 ఎంపీటీసీ స్థానాలు ప్రజలు కట్టబెడితే.. అధికారంతో ఎన్నికల్లో అడ్డదారులు తొక్కినా టీడీపీ 68 ఎంపీటీసీలకే పరిమితమైంది. కాగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగి ఉంటే టీడీపీకి పూర్తి స్థాయిలో పరాభవం తప్పేది కాదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


