మదనపల్లె సిటీ: వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం పుస్తకావిష్కణను సోమవారం మదనపల్లెలో ప్రముఖ నవలా రచయిత, రాష్ట్ర రచయితల సంఘం ఉపాధ్యక్షులు టీఎస్‌ఏ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత బత్తెన ఈశ్వరకుమార్‌రెడ్డి రచించిన పుస్తకాన్ని పలువురు రచయితలు సమీక్షించారు. టీఎస్‌ఏ క్రిష్ణమూర్తి మాట్లాడుతూ గ్రంథాన్ని చూసిన తర్వాత ప్రాచీనకాలం నుంచి నేటి వరకు రాయలసీమలో ఇంత గొప్ప కవులున్నారని తెలిసిందన్నారు. రాయలసీమ సాహిత్యానికి ఇంతటి మహోన్నతమైన చరిత్ర ఉందని తెలుసుకోవడం జరిగిందన్నారు. వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ భౌగోళిక స్వరూపంతో మొదలైన ఈ గ్రంథంలో రాయలసీమ ప్రాచీన సాహిత్యం, పౌరాణిక,దేశీ, జానపద సాహిత్యాలు, పద కవితా పితామహుడు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం, శతక,అవధాన సాహిత్యం, నాటకం, చారిత్రక పద్య కావ్యాలు, ఆఽధునిక వనచ కవిత్వం, అభ్యుదయ సాహిత్యం, రాయలసీమ పత్రికల ప్రస్థానం, కవయిత్రులు, రాయలసీమ నుంచి వచ్చిన నవల, కథా సాహిత్యాలు, సంస్కృతి సంప్రదాయాలు, జానపద కళా వైభవం మొదలైన విలువైన వ్యాసాలు చోటు చేసుకున్నాయన్నారు. కార్యక్రమంలో అధికార భాషా పూర్వపు సభ్యులు డాక్టర్ తవ్వా వెంకటయ్య, లలితమ్మ, ప్రజా చైతన్య వేదిక సభ్యులు శ్రీనివాసులునాయుడు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.


