● ఇదేనా కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్యం?
● ఎన్నికల వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఖూనీ చేసింది
● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి అర్బన్ : ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులను ఎన్నుకోవాలి.. ప్రజల ఓటే ప్రభుత్వాల భవితవ్వాన్ని నిర్ణయించాలి.. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల తీర్పునకు తావులేకుండా, స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్షన్.. సెలక్షన్.. నో ఎలక్షన్ అనే కొత్త విధానానికి కూటమి ప్రభుత్వం తెరతీసిందని, ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకునే ప్రాథమిక హక్కును సైతం హరించిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే ఇక సామాన్యుడికి దిక్కెవరని ప్రశ్నించారు.
నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు అడ్డంకులే
స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలను భయబ్రాంతులకు గురిచేసే ప్రక్రియగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థికి నామినేషన్ వేయడమే ఒక గండంగా, వేసిన నామినేషన్‌ను నిలుపుకోవడం మరో గండంగా, ప్రచారం చేసుకోవడం ఇంకో గండంగా, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సైతం భయాందోళనల మధ్య సాగాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నిర్ణయంతో జరగాల్సిన ఎన్నికల్లో ప్రజలనే భయపెట్టి, అభ్యర్థులను బెదిరించి, ప్రత్యర్థులను పోటీకి దూరం చేసి సాధించే విజయాలకు ప్రజాస్వామ్య విజయాలని పేరు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. ఇలా కాకుండా అధికార పార్టీ నాయకులే పేర్లు రాసుకుని వారే ప్రజాప్రతినిధులని ప్రకటించుకుంటే సరిపోతుందని కదా అంటూ ఎద్దేవా చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ ఓటు హక్కుకే ఆటంకాలా..?
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకుంటానని ముందుగానే సమయం తీసుకున్నప్పటికీ, ఆయన ప్రయాణానికి అనుమతుల విషయంలో చివరి వరకు ఆటంకాలు సృష్టించడం దారుణమన్నారు. పులివెందులలో 80 పోలింగ్ కేంద్రాలు ఉంటే 70 పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను అనుమతించకుండా తరిమేశారని ఆరోపించారు. కడప, పుత్తూరు, రాయచోటి, పుంగనూరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికల ప్రక్రియ ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో ఒక వైపు రాజకీయ అరాచకాలు.. మరో వైపు మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాప్తాడులో పాఠశాలకు వెళ్లే బాలికను రంపంతో దాడి చేసిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమన్నారు.
రైతులను ఆదుకునే దిక్కేది?
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రైతులు సాగు చేసిన పంటలు చేతికందక ఎండిపోతున్నాయని, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు సైతం ఎండిపోయి రైతులు త్రీవంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు రాష్ట్రంలో కొత్త ఫించన్లు, కొత్త ఇల్లు మంజూరు కాలేదన్నారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకు ఫించన్లను పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధితులపైనే కేసులా?
రాయచోటి ప్రజలకు సేవలందించిన వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన దాడిని శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కార్యాలయానికి నిప్పు పెట్టి, వాహనాలను తగలపెట్టి ఇష్టానుసారంగా దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, దాడికి గురైన తమ పార్టీకి చెందిన సుమారు 250 మందిపై ఐపీసీ 307 కింద కేసులు నమోదు చేయడం ఎంత వరకు సమంజసమని పశ్నించారు. బ్రిటిష్ పాలకులు కూడా ఇలాంటి ఆలోచనలు చేసి ఉండరని, రాచరికంలో ఉన్న కర్కోటక పాలకులు సైతం ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఉండని వ్యాఖ్యానించారు. దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అన్నారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారితో పాటు, అన్నీ చూస్తూ మౌనంగా ఉండే అధికార వ్యవస్థలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాయచోటికి జిల్లా కేంద్రం రిటర్న్ గిఫ్ట్ అడగండి..
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఈ ప్రాంతాన్ని చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామని చెబుతున్న కూటమి నాయకులకు శ్రీకాంత్ రెడ్డి సూటి ప్రశ్న సంధించారు. ప్రజల ఓటు హక్కును వినియోగించుకోకుండా చేసి, ప్రజల మద్దతు లేకుండానే ఎన్నికల్లో విజయాలు సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా,.. దానినే మీరు చంద్రబాబుకు ఇచ్చే గిప్ట్గా బావిద్దాం... మరి ఆయన నుంచి రిటర్న్ గిఫ్ట్‌గా ఏమి అడుగుతున్నారు ? అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించే ధైర్యం ఉంటే, రాయచోటి జిల్లా కేంద్రాన్ని తిరిగి సాధించి ఇవ్వాలని చంద్రబాబు నాయుడును అడగాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ నవాజ్, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.


