మర్డర్‌లో మైండ్‌ గేమ్‌! | - | Sakshi
Sakshi News home page

మర్డర్‌లో మైండ్‌ గేమ్‌!

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

కురబలకోట : బి.కొత్తకోట మండలం బండారువారిపల్లి గ్రామం పెద్దపల్లికి చెందిన చల్లా ప్రశాంత్‌ (35) హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఘటనా స్థలంలో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే ఇది సాధారణ హత్యలా కాకుండా, ఒక పక్కా స్క్రిప్ట్‌ ప్రకారం జరిగిన హై–ప్రొఫైల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఈ పాశవిక హత్య వెనుక నిందితులు ఆడిన మైండ్‌ గేమ్‌ పోలీసులకే సవాల్‌గా మారింది. ఈ కేసులో నిందితులు ఆధారాలను పక్కదారి పట్టించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సాధారణంగా హత్య జరిగిన చోటే ఆధారాలు లభ్యమవుతాయి. కానీ ఈ ఘటనలో మృతదేహం ఒక చోట...కారు మరో చోట.స్కూటి ఇంకో చోట...ఇలా వేర్వేరు ప్రాంతాల్లో లభ్యం కావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఒక మనిషిని హతమార్చడమే కాకుండా, ఆ హత్యను మరో రూపంలో చూపించేందుకు పక్కా ప్లాన్‌ (సీన్‌ క్రియేషన్‌) చేసినట్లు స్పష్టమవుతోంది.

స్కూటీ అద్దం కూడా పగలలేదు

ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహేష్‌.. తన కారుతో ఢీకొట్టడం వల్లే స్కూటీపై వెళ్తున్న ప్రశాంత్‌ చనిపోయాడనే వాదనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదనే సత్యం స్పష్టమవుతోంది.కారు బలంగా ఢీ కొడితే స్కూటీ ముందు భాగం ధ్వంసం కావాలి, వాహనం కింద పడిపోవాలి. కానీ, అక్కడ స్కూటీకి కనీసం ముందున్న అద్దం కూడా పగలలేదు. ప్రమాదానికి గురైన వాహనం రోడ్డు పక్కన నీట్‌గా స్టాండ్‌ వేసి ఉంది. ఘటనా స్థలంలో కనీసం ఒక్క రక్తపు బొట్టు గానీ, ప్రమాదం జరిగిన ఆనవాళ్లు గానీ లేవు. కేవలం స్కూటీ హ్యాండిల్‌ను మాత్రం సీటు వరకు వంచి ఉంచారు. నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే హైవేపై హత్య చేయడం సాధ్యం కాదు కాబట్టి, ప్రశాంత్‌ను వేరే ఏదైనా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాతే ప్రమాదంగా చూపించేందుకు ఈ డ్రామా ఆడారని నమ్ముతున్నారు.

మానవత్వమే ప్రాణం తీసింది!

ఈ దారుణంలో అందరినీ కలచివేస్తున్న అంశం ప్రశాంత్‌ మంచితనమే. ప్రస్తుతం సమాజంలో ’మనకెందుకులే’ అని అందరూ తప్పుకుంటున్న రోజుల్లో, ప్రశాంత్‌ మానవత్వంతో స్పందించాడు. ఒక వృద్ధుడిని (పెద్దాయనను) నిందితులు కొడుతుంటే తట్టుకోలేక, ఆ గొడవలో జోక్యం చేసుకుని అడ్డుకున్నాడు. ఆ రోజు తను వెనకడుగు వేసి ఉంటే ఈ రోజు తన కుటుంబంతో నవ్వుతూ గడిపేవాడు. కానీ, ఒకరి అమాయకత్వంపై మరొకరు చూపించిన శాడిజమే ప్రశాంత్‌ను బలితీసుకుంది.

సాఫ్ట్‌వేర్‌ మైండ్‌.. పోలీసులకు ఛాలెంజ్‌!

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు కావడంతో, తన టెక్నికల్‌ తెలివితేటలను ఉపయోగించి డిజిటల్‌, ఫిజికల్‌ ఆధారాలు దొరకకుండా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. టెక్నాలజీ ఆధారంగా నేరాన్ని కప్పిపుచ్చాలని చూసిన ఈ మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.కాగా, బుధవారం ప్రశాంత్‌ అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. ఈ కేసుపై రూరల్‌ సర్కిల్‌ సీఐ రవినాయక్‌ మాట్లాడుతూ.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, త్వరలోనే నిందితులను పట్టుకుని ఈ మర్డర్‌ మిస్టరీని ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రశాంత్‌ హత్య వెనుక సాఫ్ట్‌వేర్‌ ప్లాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement