మదనపల్లె టౌన్ : ఫోర్జరీ కేసులో ముగ్గురికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు మదనపల్లె రెండో పట్టణ సీఐ గోపాల్ రెడ్డి బుధవారం తెలిపారు. సీఐ మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన లేడీ డాన్ కోనేటి సులోచన, ఆమె ప్రధాన అనుచరులు రెడ్డప్పనాయుడు కాలనీకి చెందిన కడియాల శ్రీరాములు నాయుడు, గండి మోహనన్లను ఇటీవల ఫార్జరీ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అన్నారు. ఇదిలా ఉండగా పట్టణానికి చెందిన మార్పురి శ్రీరామ్ భూమిని ఫోర్జరీ దస్త్రాలతో తన పెదనాన్న కృష్ణమూర్తి కుమారుడు మార్పురి వెంకటేష్ భూమిని రాసిచ్చినట్లు కోట్ల విలువైన శ్రీరామ్ భూమిని స్థానిక టమాటా మార్కెట్ యార్డు వద్ద 2003లో కబ్జా చేసిందన్నారు. ఈ కేసులో బాదితుడి ఫిర్యాదుపై వారం క్రితం కోనేటి సులోచనతో పాటు స్థానిక రెడ్డెప్ప నాయుడు కాలనీలో ఉండే కడియాల శ్రీరాములు నాయుడు సహా మరో 12 మంది పై ఫార్జరీ కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఇదివరకే వన్‌టౌన్ పోలీసులు ఫార్జరీ కేసులో సులోచనతో పాటు శ్రీరాములు నాయుడును అరెస్టు చేయడంతో సబ్ జైల్లో ఉన్నట్లు తెలిపారు. దీంతో మార్పురీ శ్రీరామ్ ఫిర్యాదుతో నమోదైన కేసులో పీటీ వారెంట్ పై కస్టడీకి తీసుకుని శ్రీరామ్ కేసులో కోనేటి సులోచన, గిండి మోహన్, కడియాల శ్రీరాములు నాయుడును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.


