అక్రమాలతో వైఎస్సార్‌సీపీని ఓడించారు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలతో వైఎస్సార్‌సీపీని ఓడించారు

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

ఓటర్లను భయపెట్టి గెలిచారు..

ఓటర్లను భయపెట్టి గెలిచారు..

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడి వైఎస్సార్‌సీపీని ఓడించారని ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి జింకా వెంకటా చలపతి, మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డి, సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ ఆరోపించారు. ఓటర్లను భయపెట్టడం, దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ ద్వారా టీడీపీ గెలిచిందని అన్నారు. బుధవారం స్థానిక ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చలపతి మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రం వద్ద ఏజెంట్‌ విషయమై ప్రశ్నించిన తనను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, చైర్మన్‌ అభ్యర్థి శ్రీరామ్‌ కుమార్‌ తనను రామాపురం ఎస్‌ఐ చేత కొట్టించారని ఆరోపించారు. ఎన్నికల రోజు జరిగిన ఈ ఘటన తర్వాత, వాళ్లు రెండు కాళ్లు విరగగొట్టమంటే మేము ఒక కాలే విరగ్గొట్టామని పోలీసులు చెప్పుకోవడం విన్నవారు తనకు ఈ విషయం చెప్పారని చలపతి అన్నారు. తద్వారా భయభ్రాంతులను సృష్టించి తమ పార్టీకి అనుకూలమైన ఓట్లు రానివ్వకుండా, తాను తిరగకుండా చేశారన్నారు. ముస్లిం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాల్లో చైర్మన్‌ ఏజెంట్లు లేకుండా చేసేందుకు ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థి శ్రీ రామ్‌ కుమార్‌ వెంట రౌడీ మూకలు తిరుగుతూ రిగ్గింగ్‌ కోసం ప్రయత్నించారని అన్నారు. ఫారం ఎనిమిదిలో పోలైనట్టు పేర్కొన్న ఓట్లకు, లెక్కింపు ఓట్లకు తేడా ఉందని ఇది కూడా టీడీపీ చేసిన అక్రమాలేనని ఆరోపించారు. దీనికి ఉదాహరణ 45వ వార్డులో ఈ తేడాను గుర్తించిన ఎన్నికల అధికారి తమ ఏజెంట్‌ కు ఫోన్‌ చేసి పిలిపించడమే అక్రమాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఐదేళ్ల పదవి కోసం అక్రమాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో అవినీతికి పాలు పడితే చూస్తూ ఊరుకోమని అడ్డుకుంటూ పోరాటం చేస్తామని, ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. సమావేశంలో కౌన్సిలర్లు షర్మిలాబాను, నీలూఫర్‌, తౌఫిఖుల్లా, నగీనా, నాగరాజు, నాయకులు వీఎస్‌.రెడ్డి, ఎన్‌.నవాజ్‌ అలీఖాన్‌, యూనస్‌, విశ్వనాఽథ్‌, ఖాదర్‌, నూరుల్లా, జబీ, యాసీన్‌, మల్లికార్జునరెడ్డి, చలపతి, బొమ్మిశెట్టి మధు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థులను భయపెట్టారు..

వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులను టీడీపీ భయపెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లను కూర్చోనివ్వకుండా చేశారన్నారు. లోపల ఉన్న వారిని భయపెట్టి బయటకు తరిమేసి దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు. ముస్లింలను ఓటింగ్‌ కు రానీయకుండా భయపెట్టారన్నారు. అక్రమాలు జరిగిన కేంద్రాలకు సంబంధించి రీ పోలింగ్‌ కోసం తమ ఏజెంట్లు పట్టుబట్టినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు చెప్పారు. ఓటింగ్‌ శాతం తగ్గించడం ద్వారా టీడీపీ గెలిచేందుకు సహకరించారని ఆరోపించారు. తమ అభ్యర్థులు 12 మంది గెలిచారని.. ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తామని అన్నారు.

నన్ను కొట్టించింది

మంత్రి మండిపల్లి, చైర్మన్‌

చైర్మన్‌ అభ్యర్థి చలపతి ఆరోపణ

భయభ్రాంతులు సృష్టించి టీడీపీ గెలించింది

మదనపల్లెలో ఈ సంస్కృతికి

స్వస్తి పలకండి

ఆగ్రహం వ్యక్తంచేసిన

మాజీ ఎమెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి,

సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌

మదనపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ వారు ప్రజలను భయపెట్టి ఓట్లు వేయకుండా గెలిచారని మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ అన్ని వ్యవస్థలు, అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేశాయని ఆరోపించారు. ముస్లిం, ఇతర వర్గాల ఓటర్లను భయపెట్టి అనుకూలంగా చేసుకొన్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకోవడం హక్కు, దీన్ని హరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మదనపల్లిలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించారని, భవిష్యత్‌ తరాలు ఇలాగే వ్యవహరించే ప్రమాదం ఉందని, టీడీపీ నేతలు ఇప్పటికై నా దీనికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఎన్నికల్లో నామినేషన్‌ వేయడం నుంచి కౌంటింగ్‌ వరకు జరిగిన అన్ని పరిణామాలను ఆయన వివరిస్తూ.. ప్రతి ఒక్క చర్య టీడీపీకి అనుకూలంగానే జరిగిందన్నారు. ఇప్పటికై నా ఈ సంస్కృతికి ముగింపు పలకాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement