కలికిరి: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2027 (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సైనిక పాఠశాలల్లో 6వ, 9వ తరగతిలలో ప్రవేశాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబరు నెల 2వ తేదీ లోపు ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఎన్‌టిఎ.ఎసి.ఇన్ నందు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.850, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.700 ఫీజు చెల్లించాల్సి ఉంది. ఆలస్య రుసుముతో డిసెంబరు నెల 3 నుంచి 6వ తేదీ రాత్రి 11.50 గంటల లోపు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. డిసెంబరు 7 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులలో మార్పులు, చేర్పులు, జనవరి 11న పరీక్షా కేంద్రాల సమాచారం, జనవరి 25వ తేదీ నుంచి ఎన్‌టిఎ వైబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయన్నారు. జనవరి 31న మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు 6వ తరగతి ప్రవేశ పరీక్ష, 2 నుంచి 5 గంటల వరకు 9వ తరగతి పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. కాగా కలికిరి సైనిక పాఠశాలలో 6వ తరగతికి 72 సీట్లు, 9వ తరగతికి 9 సీట్లు ఖాళీ వున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు పాఠశాలల వెబ్‌సైట్ లేదా ఎన్‌టిఎ వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.
బాస్కెట్ బాల్
జిల్లా జట్టు ఎంపిక
వాల్మీకిపురం: స్థానిక ప్రభుత్వ పీవీసీ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అండర్ 17 బాస్కెట్ బాల్ బాలబాలికల జట్లు ఎంపికను నిర్వహించినట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది బాస్కెట్ బాల్ బాలికలకల క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ ఎంపికలో అత్యంత ప్రతిభ కనబరిచిన అండర్ 17 బాలబాలికలను జిల్లా జట్లకు ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రమేష్ బాబు, జయక్రిష్ణ, హెచ్‌ఎం వసుంధర పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్
కేంద్రాల పరిశీలన
సాక్షి, మదనపల్లె: గురువారం జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ అనంతరం మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అధికారులతో కలిసి పరిశీలించారు. మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, పెద్దమండెం, మొలకలచెరువు, పిటిఎం, బి.కొత్తకోట, కురబలకోట, పుంగనూరు, చౌడేపల్లి మండలాలకు సంబంధించి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి 507 పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సామగ్రి స్వీకరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను జేసీ పరిశీలించారు. జడ్పీ సీఈవో లక్ష్మీపతి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ విజయశేఖర్, సర్వే శాఖ ఏడి శాంత రాజ్, డిఎల్డివో శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో
కొండచిలువ కలకలం
తంబళ్లపల్లె : సిద్ధార్థపురం కాలనీ సమీపంలోని కాకులకానచెరువు కట్టపై బుధవారం సుమారు 10 అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పశువులు, జీవాలు మేపడానికి వచ్చిన కాపరులు దానిని చూసి భయంతో పరుగులు తీశారు. గొర్రెలు, మేకలను సైతం మింగేసేలా ఉన్న ఈ కొండచిలువపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్పందించారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, కాపరులు పొలాల వద్ద జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


