కలికిరి: అధికార పార్టీ బెదిరింపులకు తలొగ్గకుండా మండల జెడ్పీటీసీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలని వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండలంలోని వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు. కలికిరి మండల వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి చీనేపల్లి అనిత భర్త రత్నశేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ రమేష్‌కుమార్ రెడ్డిలు బుధవారం కలికిరికి విచ్చేసి మాజీ మంత్రిని కలిసి మండలంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లకు కూడా పోలీసులు నోటీసులు అందచేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. అధికార పార్టీ అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడుతారని, పార్టీ గెలుపుకోసం పని చేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని, మండలంలో నాయకులు కలిసి కట్టుగా పని చేయాలని ఆయన సూచించారు. నాయకులు వరుణ్‌రెడ్డి, ఎంఐ హనీఫ్, యుగంధర్, శామ్యూల్ తదితరులు మాజీ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.


