నీటి బొట్టు.. ఒడిసిపట్టు | - | Sakshi
Sakshi News home page

నీటి బొట్టు.. ఒడిసిపట్టు

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

కడప అగ్రికల్చర్‌ : ఈ ఏడాది వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాభావ నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి పాతాళానికి పడిపోయాయి. దీంతో ఉద్యాన పంటల రక్షణకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉన్న బోర్లలో నీరు తగ్గి అరకొరగా వస్తున్నాయి. దీంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో పండ్ల తోటలు ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో బోర్లలో వచ్చే అరకొర నీటిని ఫార్మ్‌పాండ్స్‌లో నింపుకొని తరువాత అవసరమైనప్పుడు పొదుపుగా వాడుకుని పంటలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతులకు ఫార్మ్‌పాండ్స్‌ను రాయితీతో మంజూరు చేస్తోంది. ఇందులో వ్యక్తిగత ఫార్మ్‌పాండ్స్‌తోపాటు కమ్యూనిటీ ఫార్మ్‌పాండ్స్‌ను మంజూరు చేస్తోంది. వీటిని ఉద్యాన రైతులు సద్వినియోగం చేసుకుని తమ పంటలను కాపాడుకుందేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.

వ్యక్తిగత ఫార్మ్‌పాండ్స్‌కు 50 శాతం రాయితీ

ఉద్యాన రైతులకు సంబంధించి వ్యక్తిగత 50 వ్యక్తిగత ఫార్మ్‌పాండ్స్‌ నిర్మాణానికి 50 శాతం రాయితీతో ఇస్తుంది. దీనిని రైతులు 20 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు(20 ఇంటు 20 ఇంటు 3) పరిమాణంతో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆయ్యే ఖర్చు రూ.1,80,000 కాగా ప్రభుత్వం రాయితీ (50 శాతం) రూ.90 వేలు ఇస్తుంది. రైతు భరించాల్సిన ఖర్చు రూ.90 వేలు.

కమ్యూనిటీ ఫార్మ్‌పాండ్స్‌కు 75 శాతం రాయితీ

గ్రూపు సహకారంతో కమ్యూనిటీ ఫార్మ్‌పాండ్స్‌ నిర్మాణానికి 75 శాతం రాయితీ ఇస్తుంది. దీనిని రైతులు 100 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల లోతు(100 ఇంటు 100 ఇంటు 3)తో నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.24 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం రూ.18 లక్షలు రాయితీ ఇవ్వగా, రైతు రూ.6 లక్షలను భరించాల్సి ఉంటుంది.

ఫార్మ్‌పాండ్స్‌ నిర్మించుకునేటప్పుడు

గుర్తించుకోవాల్సిన విషయాలు

] ఫార్మ్‌పాండ్స్‌ నిర్మాణానికి పొలంలో నీరు చేరే అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.

] భూమి విస్తీర్ణం, నేల స్వభావం, వర్షపాతం ఆధారంగా కుంట పరిమాణాన్ని నిర్ణయించాలి.

] నీరు ఎక్కువగా ఇంకి పోకుండా అవసరమైతే లైనింగ్‌ ఏర్పాటు చేసుకోవాలి.

] కట్టలు, నీరు బయటికి వెళ్లే మార్గం పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి.

ప్రయోజనాలు

] ఫార్మ్‌పాండ్స్‌ రైతుకు నీటి భద్రతను అందిస్తుంది. సరైన ప్రణాళికతో నిర్మిస్తే సాగునీటి ఖర్చులు తగ్గించుకోవడానికి, పంటల ఉత్పాదకతను మెరుగుపరుచుకోవడానికి సహాయ పడుతుంది.

] ఫార్మ్‌పాండ్‌ నిర్మాణంతో నీటి కొరత వల్ల కలిగే నష్టాలు తగ్గుతాయి.

] కరువు పరిస్థితుల్లో రైతులకు భరోసా ఇస్తాయి.

రాయితీ కోసం అవసరమైన పత్రాలు

ఫార్మ్‌పాండ్స్‌ నిర్మాణానికి రైతులు తమకు సంబంధించిన పట్టాదారు పాస్తు పుస్తకాన్ని తీసుకెళ్లాలి. దీంతోపాటు ఆధార్‌కార్డు, 1బి, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్ట్‌పోర్టు సైజు ఫొటో తీసుకుని వెళ్లాలి.

ఆకాశం నుంచి కురిసే ప్రతి వాన చుక్కా అమూల్యమైనదే. కానీ, సరైన ప్రణాళిక లేకపోతే ఆ నీరంతా కళ్లముందే వృథాగా పోతుంది. కరవు నేలలో సైతం పడే ప్రతి వాన బొట్టును ఒడిసిపట్టి, కష్టకాలంలో పంటలకు రక్షక తడులు అందించే అద్భుత జలనిధి ‘ఫార్మ్‌పాండ్స్‌’(వ్యవసాయ కుంటలు). వానలు ముఖం చాటేసినప్పుడు

ఎండిపోయే చేలను కాపాడుకోవడానికి వరప్రదాయినిగా నిలుస్తున్నాయి. ‘నీటి బొట్టు ఒడిసిపట్టు.. పంటలు తడిచేటట్టు!’ అనే నినాదంతో రైతాంగానికి కొండంత భరోసా ఇస్తున్న వ్యవసాయ కుంటల ప్రాధాన్యత, వాటి నిర్మాణ విశేషాలపై ప్రత్యేక కథనం.

వ్యవసాయ కుంటలతో

నీటి ఎద్దడికి అడ్డుకట్ట

కరువు నేపథ్యంలో రైతులకు ప్రయోజనం

ఫార్మ్‌పాండ్స్‌కు రాయితీలు

సద్వినియోగం చేసుకోవాలి

ఉద్యాన పంటల సాగు చేసి అర్హత గల ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫార్మ్‌పాండ్‌ నిర్మాణానికి సంబంధించి వ్యక్తిగత ఫార్మ్‌పాండ్‌ నిర్మాణానికి 50 శాతం రాయితీ, కమ్యూనిటి ఫార్మ్‌పాండ్‌ నిర్మాణానికి 75 శాతం రాయితీ ఇస్తున్నాము. మరిన్ని వివరాలకు మీ దగ్గర ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్న ఉద్యానశాఖ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకోవాలి.

– హరి ప్రసాద్‌,

జిల్లా ఉద్యానశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement