పాత కక్షలతో పాశవిక హత్య | - | Sakshi
Sakshi News home page

పాత కక్షలతో పాశవిక హత్య

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

కురబలకోట : ఆరు నెలల క్రితం తలెత్తిన చిన్నపాటి దారి వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తనది కాని దారి సమస్యలో మానవత్వంతో జోక్యం చేసుకున్న పాపానికి భార్యకు జీవితాంతం తీరని వేదన.. ఇద్దరి పిల్లలకు తండ్రిని దూరం చేసింది. క్షణికావేశాలు, పాత పగలు చివరకు ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈ దుస్సంఘటన కురబలకోట మండల సరిహద్దు కాండ్లమడుగు సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బి.కొత్తకోట మండలం బండారువారిపల్లి గ్రామం పెద్దపల్లికి చెందిన చల్లా ప్రశాంత్‌(35) స్వగ్రామంలో కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. అదే ఊరికి చెందిన మహేష్‌(37) వ్యవసాయం చేస్తూ సాఫ్ట్‌వేర్‌గా ఉంటున్నారు. అదే ఊరిలో ఆరు నెలల క్రితం భూముల వద్దకు రాకపోకలు సాగించే దారి సమస్య తలెత్తింది. ఈ విషయంలో ఓ పెద్దాయనపై ఆప్పట్లో మహేష్‌ చేయి చేసుకున్నారు. పెద్దాయనను కొట్టాడన్న ఆగ్రహంతో అప్పట్లో ప్రశాంత్‌ మరి కొందరు మహేష్‌పై చేయి చేసుకున్నారు. ఇది మనసులో పెట్టుకున్న మహేష్‌ తీవ్ర కక్ష పెంచుకున్నారు. నాలుగు నెలలుగా ప్రతీకారంతో ఊరికి కూడా రాకుండా.. మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లిలో ఉండసాగాడు. తనను కొట్టాడన్న కారణంగా ప్రశాంత్‌పై పగతీర్చుకోవాలని పథకం పన్నాడు. సోమవారం రాత్రి ప్రశాంత్‌ మదనపల్లి నుంచి వస్తున్నట్లు పసిగట్టాడు. కాండ్లమడుగు వద్ద కాపు కాసి ఎదురుగా కొద్ది దూరంలో స్కూటీపై వస్తున్న ప్రశాంత్‌ను కారుతో బలంగా ఢీకొట్టాడు. ప్రశాంత్‌ తలకు, ముఖానికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఇతన్ని కొద్ది దూరంలో హైవేని ఆనుకుని ఉన్న పొలం వద్దకు కారులోనే తీసుకెళ్లి పడేసి వెళ్లిపోయారు. కారును సంఘటన స్థలానికి కొద్ది దూరంలో హైవే పక్కన వదిలేసి వెళ్లడంతో.. ఈ హత్యకు వీరే కారణమని వెలుగు చూసింది. ఈ హత్యలో మహేష్‌తోపాటు మరికొందరి ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నారు.

రాత్రంతా గాలింపు.. ఉదయం వెలుగులోకి..

సోమవారం రాత్రి ముదివేడు పోలీసులకు హత్య జరిగినట్లు 100 నంబరు నుంచి కాల్‌ రావడంతో వారు హుటాహుటిన వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంత్‌ బంధు మిత్రులు కూడా రాత్రంతా వెతికారు. రాత్రి వేళ కావడం, ఆపై పొలంలో పడేసి ఉండటంతో కనుగొనలేకపోయారు. మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ సర్కిల్‌ సీఐ రవినాయక్‌ చేరుకుని క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ బృందాలతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

మూడు ప్రత్యేక బృందాలు

ఈ హత్య కేసును పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితులను పట్టుకోడానికి జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో రూరల్‌ సర్కిల్‌ సీఐ రవినాయక్‌ నేతృత్వంలో మూడు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. తనది కాని సమస్యలో జోక్యం చేసుకోవడంపై కక్ష పెంచుకున్న ప్రత్యర్థి.. ప్రశాంత్‌ను కిరాతకంగా హత్య చేయడం కలవరాన్ని కలిగిస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

కారుతో ఢీకొట్టి పొలంలో పడేసి పరారీ

దారి వివాదంతో నిండు ప్రాణం బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement