కలకడ : మండలంలోని ఎర్రకోటపల్లె ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన పవన్‌కుమార్‌రెడ్డిని గుర్తు తెలియని వాహనం(కారు) ఢీకొంది. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం ఉదయం ఎర్రకోటపల్లె ఎంపీటీసీ స్థానం పరిధిలోని ముడియంవారిపల్లెకు తన ద్విచక్రవాహనంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు గుర్తించి బాధితుడిని కలికిరి మండలం మహల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మదనపల్లెకు తరలించారు. ఈ ప్రమాదంలో పవన్‌కుమార్‌రెడ్డి చెయ్యి విరిగి, కాలికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదం ఎన్నికల సమయంలో జరగడంతో ఇది ప్రత్యర్థుల దాడా..? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
బాధితుడి
వాంగ్మూలం నమోదు
పుంగనూరు : పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితుడి వాంగ్మూలాన్ని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరేష్‌కుమార్ మంగళవారం నమోదు చేశారు. పెద్దపంజాణి మండలం కమ్మినాయునిపల్లెకి చెందిన గంగప్ప కుమారుడు బి.విష్ణు(30)కు ఒక మహిళతో సాన్నిహిత్య సంబంధం ఉంది. ఇలా ఉండగా కొద్ది రోజులుగా ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురైన విష్ణు తన ఇంట్లో శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పివేసి, కాలిన శరీరంతో ఉన్న విష్ణును పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసుల అభ్యర్థన మేరకు న్యాయమూర్తి పరేష్‌కుమార్ బాధితుడి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి వృద్ధుడి మృతి
కేవీపల్లె : బావిలో ప్రమాదవశాత్తు పడి ఒంటరి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కొత్తపల్లె వద్ద చోటు చేసుకుంది. వివారలిలా వున్నాయి. కడపకు చెందిన మల్లెపు రామయ్య(75) కొన్నేళ్లుగా కొత్తపల్లెలో ఒంటరిగా జీవనం సాగించేవాడు. సోమవారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మంగళవారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం గ్రామస్తులకు అప్పగించారు. గ్రామస్తులంతా కలసి ఒంటరి వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


