అధికారమదంతో.. ఒళ్లంతా అహంకారంతో టీడీపీ గూండాలు సాగించిన దౌర్జన్యకాండకు ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. వ్యవస్థల్ని గుప్పిటపెట్టుకుని కూటమి నేతలు సాగించిన రాక్షసకాండకు ఓటుస్వామ్యం ఓడిపోయింది. ‘ఎన్నిక’ పేరిట పోలీసులు.. పచ్చమూకలు ఆడిన వికృత క్రీడతో ప్రజాస్వామ్య ‘మన్నికే’ ప్రశ్నార్థకంగా మారింది. ఏజెంట్లు లేకుండా .. ఏకపక్షంగా సాగిన పోలింగ్ ఎన్నికల చరిత్రలోనే మాయనిమచ్చగా మిగిలింది. ఈ ఎన్నికలు చూసి ప్రజాస్వామ్యవాదుల్లోనూ
ఆందోళన మొదలైంది.
సాక్షి ప్రతినిధి, కడప: పవిత్రమైన ఎన్నికల ప్రక్రియను కూటమి ప్రభుత్వం పరిహాసం చేసింది. పోలింగ్ నాడు ఉదయం నుంచే పచ్చమూకల దమన కాండ ప్రారంభమైంది. ఓటరును పోలింగ్ బూత్ దగ్గరకు రానిస్తే తమకు ఓటమి తప్పదని గ్రహించిన పచ్చనేతలు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి గెంటేశారు. ఎదురుతిరిగిన వారిపై భౌతికదాడులు చేశారు. అంతకుముందే వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఆపై పోలీసులను పహారా పెట్టి యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించి ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయాల్సిన అధికారగణం అధికారానికి దాసోహం కావడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.
మరీ ఇంతదిగజారుడుతనమా
రాజకీయ నాయకుల పదవీకాలం ఐదేళ్లు, తర్వాత ప్రజాతీర్పును బట్టి వారి భవిష్యత్ ఉంటుంది. ఉద్యోగులు మూడు దశాబ్దాలకు పైగా విధి నిర్వహణలో ఉంటారు. రాజ్యాంగానికి లోబడి వారు విధులు నిర్వర్తించాల్సి ఉంది. హీరోలుగా బతకాల్సిన ఉద్యోగులు పోస్టింగ్స్ కోసం టీడీపీ నేతలకు బానిసలయ్యారు. చట్టాన్ని ఽన్యాయాన్ని పరిరక్షించాల్సిన వారే రాజ్యాంగాన్ని కుళ్లుపొడుస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రజల వ్యక్తిగత రక్షణ కూడా కొరవడే ప్రమాదం లేకపోలేదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పవిత్రమైన ఎన్నికల ప్రక్రియ అపహాస్యం
పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు
ఎస్పీ, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
చరిత్రలో ఇలాంటి ఏకపక్ష పోలింగ్ ఇదే మొదటిది : ప్రజాస్వామ్యవాదులు


