ఎన్నికల నిబంధనలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలపై అవగాహన అవసరం

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

– జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పెద్దమండ్యం: ఎన్నికల నిబంధనల పట్ల పీఓ, ఏపీఓలకు పరిపూర్ణ అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులు నిర్వహించనున్న పీఓ, ఏపీఓలకు పెద్దమండ్యం ఉన్నత పాఠశాలలో సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌ వారి విధులపై వివరించారు. ఎన్నికల నియమావళిపై పీఓ, ఏపీఓలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ సామగ్రి స్వీకరించిన సమయం నుండి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ సీల్‌ చేయు విధానం, పేపర్‌సీల్‌ జాగ్రత్తగా అమర్చడం వంటివి మాస్టర్‌ ట్రైనర్స్‌ చేయడాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఆర్‌ఓ దామోదర్‌రెడ్డి, ఏఆర్‌వోలు తేజశ్వి, శ్రీధర్‌రావు, ఎంఈఓలు మనోహర, రామక్రిష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు

మదనపల్లె టౌన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లె సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎన్నికల్లో అక్రమ నగదు, మద్యం, ఉచిత వస్తువుల రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసు బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పత్రాలు లేని వాహనాలు, అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసుల తనిఖీలకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

జిల్లాకు తుపాను ముప్పు

– అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

మదనపల్లి (కురబలకోట): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సోమవారం సూచించారు. నవంబరు 2 నుంచి 5 వరకు వాతావరణ పరిస్థితులు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తత కలిగి ఉండాలని వాగులు, వంకలు, చెరువులు, నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకు వెళ్ల కూడదని హెచ్చరించారు. భారీ వర్షాల సమయంలో పొంగి పొర్లే వాగులు, కల్వర్టులు, తోతట్టు రహదారులను దాటే ప్రయత్నం చేయరాదన్నారు. ముఖ్యంగా విద్యుత్‌ స్తంభాలు, తెగిపడిన విద్యుత్‌ తీగలు, ప్రమాదకరంగా ఉన్న చెట్లకు దూరంగా ఉండాలన్నారు. రైతాంగం కూడా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి జిల్లాలోని సంబంధిత శాఖల ఆధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సహాయక బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమాచారం కోసం జిల్లా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08571–293001 ను సంప్రదించాలని సూచించారు.

అత్యవసర సహాయానికి

112ను సంప్రదించాలి

– ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

మదనపల్లె టౌన్‌: ‘మురసు’ తుపానుకు అతి వేగంతో పెనుగాలులు వీచే ముప్పుందని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి హెచ్చరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎస్పీ సోమవారం మదనపల్లెలో సూచించారు. నీరు చేరిన రోడ్లపై వాహనాల రాకపోకలను వెంటనే నిలిపివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు వెంటనే డయల్‌ 112 ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement