చాపాడు : మైదుకూరు –ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని చాపాడు మండలం నాగులపల్లె సమీపంలో సోమవారం ఎర్రచందనం తరలిస్తున్న గండ్లు లతీఫ్ బాషా అలియాస్ నల్లోడు అనే వ్యక్తిని పట్టుకొని అతని వద్ద నుంచి ఆరు ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ప్రొద్దుటూరు మండలం భగత్ సింగ్ కాలనీకి చెందిన లతీఫ్ ఏపీ 32 బి 6666 నంబర్ గల కారులో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తుండగా అందిన సమాచారం మేరకు ఫారెస్ట్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. నిందితుడిని పట్టుకుని తిరుపతి ఆర్ఎస్ కోర్టుకు పంపించారు. ఈ ఘటనలో పారిపోయిన దొంగల కోసం విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలియజేశారు.
మామపై అల్లుడి హత్యాయత్నం
కడప అర్బన్ : కుమార్తె కాపురం చక్కదిద్దాలని చూసిన ఓ మామపై అల్లుడు, అతని బంధువులు అల్లరి మూకలతో కలిసి ఇనుప రాడ్లతో ఘాతుకానికి ఒడిగట్టారు. చనిపోయాడని భావించి వదిలేసి వెళ్లిన ఘటన కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. కడపలోని అల్మాస్పేటకు చెందిన దౌజీ జమీల్ ఖాన్(58) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తెకు, అల్లుడికి మధ్య ఉన్న కుటుంబ సమస్య ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. కోర్టు వాయిదాలకు వెళ్లిన సమయంలో అల్లుడు ఫైరోజ్ ఖాన్, అతని తండ్రి శర్వాణి షబ్బీర్ ఖాన్, బావ యూసఫ్లు జమీల్ ఖాన్ను చంపుతామని పలుమార్లు బెదిరించారు. ఈ క్రమంలోనే, అక్టోబరు 29న తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జమీల్ ఖాన్ నమాజు కోసం మసీదుకు వెళ్తుండగా నిందితులు అల్లరి మూకలతో కాపుకాశారు. ఆయనపై ఇనుప రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తగాయాలతో జమీల్ ఖాన్ కింద పడిపోవడంతో, చనిపోయాడని భావించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహ కోల్పోయిన బాధితుడిని స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు, చికిత్స అందించారు. ‘నా కుమార్తె కాపురం బాగుపడాలని నేను ఆరాటపడుతుంటే, వారు నన్ను చంపాలని చూశారు‘ అని బాధితుడు కన్నీరుమున్నీరయ్యారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కడప టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
స్వగ్రామానికి వస్తూ..
తొండూరు : స్నేహితులతో సరదాగా గడిపి, సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న ఆ యువకుడిని మార్గమధ్యలోనే మృత్యువు కబళించింది. మరికొద్ది సేపట్లో కళ్లముందుకు వస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో శోకం అలుముకుంది. బైక్ అదుపుతప్పి కిందపడిన ప్రమాదంలో ఓ యువకుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన తొండూరు మండల పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు గ్రామానికి చెందిన ఎర్రబల్లి ప్రతాప్ (30) అనే యువకుడు వీరాపునాయునిపల్లి గ్రామంలో జరిగిన ’దొడ్డి దేవర’ కార్యక్రమానికి స్నేహితుల ఆహ్వానం మేరకు వెళ్లాడు. అక్కడ జరిగిన విందులో పాల్గొని అందరితో కలిసి సంతోషంగా గడిపాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి వేళ తన బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో తొండూరు మండలంలోని సంతకొవ్వూరు – పాలూరు మార్గమధ్యలో, పాలూరు సమీపంలోని గంగమ్మ గుడి వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు, శరీరానికి బలమైన గాయాలైన ప్రతాప్, సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అప్పటివరకు తమతో ఎంతో ఆనందంగా గడిపిన ప్రతాప్ క్షణాల వ్యవధిలో శవమై కనిపించడంతో స్నేహితులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చేతికొచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


