మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణం, నక్కలదిన్నె తండా, సత్సంగ్ రోడ్డు పక్కన ఉన్న మురుగు కాలువలో వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సదుం మండలం, నాయనపాకాల గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు రెడ్డెప్పరెడ్డి (80) గా గుర్తించారు. గతంలో రెడ్డెప్పరెడ్డి కుటుంబం నక్కల దిన్నెలో నివాసం ఉండేదని, నాలుగేళ్ల క్రితం స్వగ్రామానికి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఇక్కడే పింఛన్ తీసుకుంటూ ఉండేవారని, ఇటీవల పింఛన్ కోసం వచ్చి స్థానికంగా తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నట్లు తెలిసిందన్నారు. అతిగా మద్యం తాగి మోరిపై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు వెనక్కిపడి మృతి చెంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు, కుమారుడికి సమాచారం అందించామన్నారు రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించిన అనంతరం పూర్తి విచారణ చేపట్టి మృతికి గల కారణాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన వ్యక్తి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మదనపల్లె మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వలసపల్లె పంచాయతీ, నవోదయ కాలనీకి చెందిన సూర్యమౌళి (40) ప్రైవేట్ వాహన డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యోగా పోటీల్లో ఆర్‌కే వ్యాలీ విద్యార్థుల సత్తా
వేంపల్లె : ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–17 జిల్లాస్థాయి యోగా పోటీల్లో ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ క్యాంపస్ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు డైరెక్టర్ విజయప్రకాష్ పేర్కొన్నారు. కడపలోని డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. సాయి నరేంద్ర, మధు (ఆర్టిస్టిక్ ఫెయిర్), సుబ్బారావు (ట్రెడిషనల్ యోగా), యోషిత్ (ఆర్టిస్టిక్ సోలో) ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఓ. సుబ్బారావు, యోషిత్ (రిథమిక్ ఫెయిర్ యోగా) మరో ఇద్దరు ద్వితీయ స్థానాలు కై వసం చేసుకున్నారన్నారు. యోగా శిక్షకులు అశోక్, శ్రీదేవి అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం వీరి విజయానికి దోహదపడిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, శిక్షకులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ ప్రకాష్, ఏఓ డాక్టర్ సి. రత్నకుమారి, అకడమిక్ డీన్ డాక్టర్ ఎస్. మహబూబ్ జిలానీ, ఎఫ్‌ఓ డాక్టర్ జి. రమేష్ కై లాష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ రమణారెడ్డి, దీపికలు అభినందించారు.


