కలకడ : మండల కేంద్రంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. లాక్ చేసి ఉన్న బైక్‌ను క్షణాల వ్యవధిలో మాయం చేశారు. బాధితుడి కథనం మేరకు.. బాలయ్యగారిపల్లె పంచాయతీ దిగువపాళ్యెం గ్రామానికి చెందిన రంగాని వెంకట్రమణ సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 హెచ్‌డీ (AP 40 N 5953) వాహనాన్ని కడప రోడ్డు పక్కన ఉన్న కిట్టు మెకానిక్ షాపు వద్ద సైడ్ లాక్ చేసి పార్క్ చేశాడు. అనంతరం కూలి పని నిమిత్తం కత్తివారిపల్లెకు వెళ్లాడు.మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో, బాధితుడు కలకడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇటీవల రాత్రి వేళల్లో బంకుల్లో దొంగతనాలు, ఇప్పుడు పట్టపగలే వాహనాల చోరీలతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదంలో గాయడిన
వ్యక్తి మృతి
కలకడ : కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన చలమయ్యగారిపల్లెకు చెందిన వెంకటరమణ (50) (దోబి రమణ) తిరుపతిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సెప్టెంబర్ 28న కలకడ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మానవత సంస్థ సభ్యులు నివాళులర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.
ఆత్మహత్యకు యత్నించిన యువతి ..
చౌడేపల్లె : కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలు ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరొకరిని మృత్యువుతో పోరాడేలా చేశాయి. మనస్తాపంతో భార్యాభర్తలిద్దరూ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. భార్య మల్లిక (23) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చౌడేపల్లె పరిధిలోని గడ్డంవారిపల్లె రోడ్డు మార్గంలో గల యానాది కాలనీకి చెందిన వెంకటరమణ, మల్లిక దంపతుల మధ్య ఆదివారం కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వీరు ఇంట్లోనే విషం తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మల్లిక సోమవారం మృతి చెందింది. వెంకటరమణ ప్రస్తుతం తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


