మదనపల్లె సిటీ : జిల్లా సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న రెండు సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా సోమవారం అభ్యర్థులకు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) నిర్వహించారు. స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అభ్యర్థులు డిజిటల్ పద్ధతిలో ఈ పరీక్షను రాశారు.ఈ సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ నెలలో దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 56 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్ధుల ధ్రువపత్రాలు పరిశీలించిన అధికారులు.. విద్యార్హతల్లో సాధించిన మెరిట్, వారికున్న పని అనుభవం ఆధారంగా ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున మొత్తం 20 మందిని ఈ సీబీటీ పరీక్షకు ఎంపిక చేసి, పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేయనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ వెల్లడించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు, సీఎంఓ కరుణాకర్, సెక్టోరియల్ అధికారులు చంద్రశేఖర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


