మదనపల్లె టౌన్ : యువతను పొగాకు వ్యసనానికి దూరం చేసి, వారి భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా జిల్లాలో ‘పొగాకు రహిత యువత ప్రచారం 4.0’ను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ జి. ఉషశ్రీ తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం ఆధ్వర్యంలో అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 27 వరకు 60 రోజుల పాటు ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. సోమవారం మదనపల్లెలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన ఐఈసీ ప్రచార సామగ్రి, బ్యానర్లు, కరపత్రాలు, గోడ పత్రికలను అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓల) సహకారంతో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడటంతో పాటు, ఇప్పటికే వ్యసనపరులైన వారు ఆ అలవాటును మానుకునేలా కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. జిల్లాలో పొగాకు రహిత విద్యా సంస్థలు, పొగాకు రహిత గ్రామాల ఏర్పాటుకు కృషి చేస్తూనే, కోట్పా చట్టం–2003 నిబంధనలను అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.


