రొంపిచర్ల/ తిరుపతి రూరల్ : నాయుడుపేట–పూతలపుట్టు జాతీయ రహదారికి ఆనుకుని తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం వద్ద హత్యకు గురైన యువతి ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. మృతురాలు చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన భాగ్యశ్రీగా నిర్ధారించారు. తిరుపతి నగరంలోని ఎస్టీవీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పీజీ హాస్టల్‌లో నివసిస్తూ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఆమె పనిచేస్తున్నట్లు గుర్తించారు. గత నెల 30వ తేదీన భాగ్యశ్రీ ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, మరుసటి రోజు 31వ తేదీ రాత్రి హత్యకు గురైన యువతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె తల్లిదండ్రులు వేణుగోపాల్, లక్ష్మీదేవి గుర్తించారు. అనంతరం తిరుపతి రూరల్ పోలీసులను సంప్రదించి మృతదేహాన్ని పరిశీలించి యువతి ఒంటిపై ఉన్న దుస్తులు, నగలను చూసి ఆమె తమ కుమార్తె భాగ్యశ్రీ అని నిర్ధారించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హత్యకు గురైంది చిత్తూరు జిల్లా
రొంపిచెర్లకు చెందిన భాగ్యశ్రీగా నిర్ధారణ


