రాయచోటి టౌన్ : ఒంటరిగా ఉన్న వృద్ధురాలే లక్ష్యంగా గుర్తుతెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. గొంతుకోసి దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని దోచుకెళ్లిన సంఘటన రాయచోటి రూరల్ పరిధిలోని నక్కవాండ్లపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చాకిండ చిన్నక్క (70) అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.నెలరోజుల క్రితం వరకు ఆమె రాయచోటి పట్టణంలో నివాసముంటున్న ఓ కుమారుడి వద్దే ఉంది. ఇటీవల నక్కవాండ్లపల్లెలో ఉంటున్న మరో కుమారుడు శంకరయ్య ఇంటికి వచ్చింది. శంకరయ్య రాయచోటి పట్టణంలో బార్బర్ షాపు నిర్వహిస్తుంటాడు. శనివారం ఉదయం ఆయన విధి నిర్వహణలో భాగంగా షాపునకు వెళ్లగా, ఉదయం 11 గంటల ప్రాంతంలో కోడలు కూడా సమీప బంధువుల ఇంటికి వెళ్లింది.ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నక్క వినోదం కోసం ఇరుగుపొరుగు వారిని పిలిచి టీవీ ఆన్ చేయించుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే కోడలు ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్నక్క తీవ్ర రక్తస్రావంతో పడి ఉంది. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించింది. అయితే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మొదట మెడకు ఏదైనా తగిలి ప్రమాదవశాత్తూ రక్తగాయమై ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు, దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. అంత్యక్రియల సన్నాహాల సమయంలో ఆమె గొంతు భాగం తెగి ఉండటాన్ని గమనించారు. అంతేకాకుండా ఆమె మెడలో ఉండాల్సిన బంగారు ఆభరణం మాయమవడంతో బంధువులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎవరో గుర్తుతెలియని దుండగులు వృద్ధురాలి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని, గొంతుకోసి చంపి నగలు దోచుకెళ్లినట్లు నిర్ధారణకు వచ్చారు.సమాచారం అందుకున్న అర్బన్ సీఐ బి.వి. చలపతి, ఎస్‌ఐ విష్ణువర్థన్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్‌తో పాటు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి, ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు.


