క్వారీ గుంతలో యువకుడి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

క్వారీ గుంతలో యువకుడి అనుమానాస్పద మృతి

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వెంకప్పకోట క్వారీ వద్ద శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక గుర్తు తెలియని యువకుడు క్వారీ గుంతలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఉదయం క్వారీ సమీపంలో ఒక మృతదేహం పడి ఉండటాన్ని పశువుల కాపర్లు గమనించారు. మృతదేహం పక్కనే ద్విచక్ర వాహనం కూడా పడి ఉండటంతో, ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ మహమ్మద్‌ రఫీ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐలు సుబ్రహ్మణ్యం, బాలాజీలు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సుమారు 25 సంవత్సరాల వయస్సు కలిగి, నల్లని గడిల షర్టు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.మృతదేహానికి సమీపంలో ఒక హోండా స్కూటి నిలిపి ఉంచారు. ఆ వాహనం ముందు భాగంపై వినాయకుడు, ఆంజనేయుని బొమ్మలు ఉన్నాయి. అలాగే దానిపై బాలాజీ, రాజేష్‌ అని పేర్లు రాసి ఉన్నాయి. ఈ ఆనవాళ్ల ఆధారంగా మృతుడి గుర్తింపు కోసం పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తేనే మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement