రాయచోటి : స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో శాంతియుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి తిరిగి వస్తున్న చిన్నమండెం మండలం వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పడమటి కోన దేవనాథరెడ్డిని పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని దిగువగొట్టివీడు, చాకిబండ గ్రామాలలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి అభ్యర్థి దేవనాథరెడ్డి శాంతియుతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి లభించిన ఆదరణ, ఆప్యాయతలను చూసి ఓర్వలేని అధికార పార్టీ నేతలు ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా కొత్తపల్లి వద్ద పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవనాధ రెడ్డి వాహనంలో పోలీసులే డబ్బులు పెట్టి, అనంతరం వీడియోలు, ఫోటోలు తీసుకుని దేవనాధ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు బాబురెడ్డి, ముసల్ రెడ్డి, డ్రైవర్ సుధాకర్ లను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి కొంగు కాస్తూ, ఇలా విచ్చలవిడిగా వైసిపి పార్టీ నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే హక్కు కూడా లేదా అని ఆయన ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే హక్కు
కూడా లేదా..? : గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్


