యువకుడు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్యాయత్నం

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

మదనపల్లె టౌన్‌ : యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం పీటీఎం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలం లోని నిలువురాతి పల్లికి చెందిన ఖాదర్‌ సాబ్‌ కుమారుడు ఎస్‌ బాబు (30) కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుమందు తాగాడు. కుటుంబీకులు గమనించి అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించి రుయాకు వెళ్లాలని రెఫర్‌ చేశారు.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మండలం బసినికొండ బైపాస్‌లోని నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్‌ను ఇన్నోవా కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌గా ఉన్న స్థానిక ఇందిరానగర్‌కు చెందిన రియాజ్‌(25) తీవ్రంగా గాయపడ్డాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కారు బోల్తా

మదనపల్లె టౌన్‌ : కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఘటన బుధవారం బి. కొత్తకోట మండలంలోని కాండ్లమడుగు క్రాస్‌ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కలికిరికి చెందిన అనిల్‌ కుమార్‌ కదిరి వైపు నుంచి కారులో కలికిరికి వస్తుండగా, మార్గమధ్యంలోని బి కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతినగా, డ్రైవర్‌ అనిల్‌ కుమార్‌ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు కురబలకోట 108కు సమాచారం ఇవ్వడంతో వారు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టైల్స్‌ బండలు పడి

కూలీకి తీవ్ర గాయాలు

వేంపల్లె : చైతన్య నగర్‌లోని ఒక ప్రైవేట్‌ పాఠశాల భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. పై అంతస్తుకు తాడుతో లాగుతున్న టైల్స్‌ బండలు ఒక్కసారిగా జారి కింద పడటంతో, వీరపునాయునిపల్లె మండలం ఓబుల్‌ రెడ్డి గారి పల్లెకు చెందిన కూలీ గంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయి పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అయితే వేంపల్లె ఆసుపత్రిలో సమయానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం వల్లే గంగయ్య పరిస్థితి మరింత విషమించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement