● రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
● ఇద్దరికి తీవ్రగాయాలు
పీలేరురూరల్ : స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన షేక్ ముస్తక్ బేగ్ (55), తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం బుధవారం వారు తిరుపతి నుంచి కారులో తిరిగి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పీలేరు ఆర్డీవో కార్యాలయం సమీపంలో ప్రస్తుతం రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాగా, పనులు జరుగుతున్న ప్రాంతంలో రోడ్డుపై నిలిపి ఉంచిన ఒక వాహనాన్ని, వెనుక నుంచి వస్తున్న వీరి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న షేక్ ముస్తక్ బేగ్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.ఆయన భార్య ఆయేషాహుస్సేన్, కుమారుడు సుల్తాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పీలేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


