మదనపల్లె టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసులు 24 గంటల పాటు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. బుధవారం మదనపల్లె మండలంలోని చీకలబైలు సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద, ములకళచెరువు వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.తగిన ఆధారాలు, బిల్లులు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లరాదని ప్రజలు, వ్యాపారులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తనిఖీలకు సహకరించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే డయల్ 112కు తెలపాలని కోరారు.
బాలసదనం చిన్నారికి కొత్త జీవితం
కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న ఓ చిన్నారికి కొత్త జీవితం లభించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో బుధవారం ఆ చిన్నారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ (కారా) చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ చిన్నారులకు ప్రేమపూర్వకమైన కుటుంబ వాతావరణం, సంరక్షణ కల్పించి, వారి సమగ్ర వికాసానికి తోడ్పడాలనే లక్ష్యంతో ప్రభుత్వం దత్తత ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్, బాలసదనం సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


