మదనపల్లె (కురబలకోట) : న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రతిష్టాత్మక ‘2026 ఈసీఓఎస్‌ఓసి యూత్ ఫోరమ్’ సదస్సులో మదనపల్లె సమీపంలోని అంగళ్లు ‘మిట్స్’ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి అబ్దుల్ సమీర్ షేక్ అరుదైన ప్రతిభ చాటారు. కళాశాలలో 2018–22 బ్యాచ్‌లో ఈసీఈ చదివిన సమీర్, గతంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ‘యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలో’గానూ ఎంపికయ్యారు. అంతర్జాతీయ వేదికపై సుస్థిర అభివృద్ధి, యువత సాధికారితపై జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు. మిట్స్ విద్యార్థికి ఈ అరుదైన గౌరవం దక్కడంపై కళాశాల చాన్సలర్ నాదేళ్ల విజయ భాస్కర్ చౌదరి, పూర్వ విద్యార్థుల సంబంధాల అధికారి జి.నాగశ్వేత హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్త యువ నాయకుల ఆలోచనలు తెలుసుకోవడం తనకు మరుపురాని అనుభవమని సమీర్ పేర్కొన్నారు.


