సాక్షి, మదనపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, అభ్యర్థులు సమన్వయంతో పని చేయాలని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, పరిశీలకురాలు అనీషారెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనాథరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి తదితరులతో పలు అంశాలపై సమీక్షించారు. మదనపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం, చైర్మన్ జింకా చలపతి, కౌన్సిల్ అభ్యర్థుల గెలుపునకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాలని, ప్రతి ఓటరును కలిసి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పని చేయాలని, నిర్లక్ష్యం వద్దని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. అభ్యర్థుల విజయం కోసం స్థానిక నాయకుల నుంచి నియోజకవర్గ నాయకులు సమన్వయం చేసుకొని పని చేయాలని కోరారు. వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజల్లో మద్దతు లభిస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలు, పథకాల అమలులో మోసం, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల విజయానికి నాయకులు జగనన్న పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రతిగడపకు వెళ్లి వివరించాలని సూచించారు. తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామాల్లో అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ రాగానే ప్రచారంపై దృషి్‌ట్ పెట్టాలని, గ్రామస్థాయి కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
కృష్ణారెడ్డికి పరామర్శ
దివంగత మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు గుడిసె కృష్ణారెడ్డిని సోమవారం మదనపల్లెలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. వయోభారంతో ఉన్న కృష్ణారెడ్డిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
నేతలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి సూచన


