రామసముద్రం : మండలంలోని చెంబకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో పాఠశాల విద్యార్థి తరుణ్‌కుమార్ రాజు 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తిరుపతి జిల్లా నగరి పట్టణంలో జరిగిన హ్యాండ్‌బాల్ పోటీల్లో విద్యార్థులు కార్తీక్ రాజు, భరత్, బద్రీనాథ్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే కురబలకోట క్రీడా మైదానంలో జరిగిన ఫుట్‌బాల్ పోటీల్లో విద్యార్థినులు వాణిశ్రీ, చైత్ర, పావని ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్‌బాబు, కమిటీ చైర్మన్ సోమశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు దిలీప్‌కుమార్, మంజులమ్మతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
బాలల హక్కుల పరిరక్షణకు న్యాయ సాయం
కడప అర్బన్ : బాలల హక్కులను పరిరక్షించడంతోపాటు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మేధో వైకల్యాలు కలిగిన వ్యక్తులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్ సూచనలతో సోమవారం కడప కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో పిల్లల కోసం న్యాయ సేవా విభాగం (ఎల్‌ఎస్‌యూసీ), మానసిక అనారోగ్యం, మేధో వైకల్యాలు కలిగిన వ్యక్తుల కోసం న్యాయ సేవా విభాగం (ఎల్‌ఎస్‌యూఎం)పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ ప్రతి చిన్నారి హక్కులను కాపాడటం (ఎల్‌ఎస్‌యూసీ) ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బాలలపై హింస, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, లైంగిక వేధింపులు వంటి సమస్యల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, అనాథ పిల్లల సంరక్షణ, బాల నేరస్తుల పునరావాసానికి అవసరమైన ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎస్.ప్రసాద్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిళ్లు పాల్గొన్నారు.


