మదనపల్లె టౌన్ : కురబలకోట మండలం ముదివేడు క్రాస్‌లోని మద్యం షాపు వద్ద శుక్రవారం రాత్రి రియల్టర్‌పై మూకుమ్మడిగా దాడి జరిగింది. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గౌడసానిపల్లికి చెందిన రవీంద్రబాబు(50) వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అంగళ్లు నుంచి గౌడసానిపల్లికి బైక్‌పై వెళ్తుండగా.. మార్గంమధ్యలోని ముదివేడు క్రాస్ మద్యం షాపు సమీపంలో పలువురు అడ్డగించారు. ఆర్థిక లావాదేవీల విషయమై ఇద్దరు మాటలు కలుపుతుండగా.. వెనుక నుంచి మరికొందరు కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తనకు తెలియలేదని బాధితుడు తెలిపారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన అతన్ని స్థానికులు గమనించి, మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగ వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. దాడికి గల కారణాలను ముదివేడు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
పటిష్ట పోలీసు బందోబస్తు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాతోపాటు మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మదనపల్లె అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆయన మదనపల్లెలో శనివారం మీడియాతో మాట్లాడారు. అన్ని నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అభ్యర్థులు, ప్రజలు సహకరించడంతో ప్రక్రియ సజావుగా సాగిందని అన్నారు. ప్రస్తుతం నామినేషన్ల స్క్రూటినీ కూడా ప్రశాంతంగా కొనసాగిందని వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, రాబోయే పోలింగ్, కౌంటింగ్‌లను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
28న టేబుల్ టెన్నిస్ పోటీలు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈ నెల 28వ తేదీన అంతర కళాశాలల టీబుల్ టెన్నిస్ (పురుషులు, మహిళలు) సింగిల్స్, డబుల్స్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వ్యాయామ విద్య, క్రీడాశాస్త్రాల విభాగాధిపతి ఆచార్య కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థలలో చదవుతూ ఉండాలని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారుల వయోపరిమితి 17 ఏళ్లకు పైబడి 25 ఏళ్లలోపు ఉండాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 9705459052 సెల్ నంబరును సంప్రదించాలని సూచించారు.


