రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దర్శించుకున్నారు. శనివారం ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్, సభ్యులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు గురించి తెలుసుకున్నారు. రాయచోటి వీరభద్రస్వామి సజ్జనార్‌కు ఇలవేల్పు దేవుడు కావడం, రాయచోటి అడిషనల్ ఎస్పీగా, కడప ఎస్పీగా ఈ ప్రాంత ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. దీంతో రాయచోటి ప్రాంతానికి చెందిన పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు వారి సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.


