● సుప్రీం ఆదేశాలతో స్పందించిన
ఎన్నికల సంఘం
● వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు పోలీసుల రక్షణ
మైదుకూరు : మైదుకూరులో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు శుక్రవారం లారీలో వచ్చి తమ నామినేషన్లు వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 32 వార్డులకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. శుక్ర, శనివారాల్లో నామినేషన్లు వేసేందుకు గడువు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, అభ్యర్థి స్వేచ్ఛగా నామినేషన్ వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ మేరకు శుక్రవారం డీఎస్పీ రాజేందప్రసాద్, అర్బన్ సీఐ హాజీవలి తాము రక్షణ కల్పిస్తామని నామినేషన్ వేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు లారీలో బయల్దేరగా లారీకి ముందు పోలీసు వాహనాల్లో అర్బన్ సీఐ హాజీవలి, ఎస్‌ఐ కత్తి వెంకటరమణ, సిబ్బంది రక్షణ కల్పిస్తూ మున్సిపల్ కార్యాలయానికి చేర్చారు. అక్కడ నామినేషన్ చాంబర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆయా వార్డులకు తమ నామినేషన్లను వేశారు. మున్సిపల్ వార్డులకు నామినేషన్లు వేసేందుకు ఈనెల 17వ తేదీ వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కిరణ్మయి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలిమేర అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు మున్సిపల్ కార్యాలయం వద్దకు రాగా టీడీపీ నాయకులు వారిపై దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేసిన విషయం విదితమే. శుక్రవారం పోలీసు రక్షణతో నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లో వీరు కూడా ఉన్నారు.
మూడో రోజు మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
చాపాడు : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిని మూడో రోజు శుక్రవారం కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నామినేషన్లు జరిగిన మూడు రోజులపాటు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ ఎంపీపీ లక్షుమయ్య, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, పల్లవోలు ఎంపీటీసీ అభ్యర్థులైన మహేష్‌యాదవ్, దోనాది సాగర్, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ మాజీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, దళిత నాయకులు మొర్రాయిపల్లెకు చెందిన బాలయ్య, బద్రిపల్లెకు చెందిన పుల్లయ్య పోలీసుల అదుపులో ఉన్నారు. మూడు రోజులపాటు తమను పోలీస్‌స్టేషన్‌కు పరిమితం చేయడంతో నామినేషన్లు వేయలేకపోయామని అభ్యర్థులు వాపోయారు.


