● చివరి రోజూ దాఖలు కాని నామినేషన్లు
జమ్మలమడుగు : మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను చివరి రోజూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయనీయలేదు. పైగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు వేసినట్లు ఆరు మండలాల్లో ఇప్పటి వరకు 30 మందికి పైగా ఫేక్ నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయాలని వెళ్తే పోలీసులు అడ్డుకుంటూ వచ్చారు. వారి నామినేషన్ పత్రాలను ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న కూటమికి చెందిన నాయకులు చించి వేయడంతోపాటు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఉదయం జమ్మలమడుగు మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు వేయడానికి గూడెంచెరువు నుంచి నాగేశ్వరరెడ్డి, ఎస్.ఉప్పలపాడు నుంచి మారంరెడ్డి అబ్రహాం, మారంరెడ్డి ద్వారకాలు నామినేషన్లు దాఖలు చేయడం కోసం వచ్చారు. నామినేషన్లు వేయటానికి వారిని పోలీసులు లోపలికి పంపించారు. అయితే అప్పటికే ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న కూటమికి చెందిన రౌడీలు నామినేషన్ల ఒక సెట్‌ను చించేశారు. మరో సెట్‌తో లోపలికి వెళ్లి వేసే ప్రయత్నం చేయగా మూడంచెల వ్యవస్థ రౌడీ మూకలు లాక్కొని చించివేశారు.
కారు ధ్వంసం
మండలంలోని వద్దిరాల ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయటానికి వెళ్లిన వెంపలాకు మహాలక్ష్మి, వెంకలాకు ప్రమీల, సుధాకర్ యాదవ్, పొట్టిపాటి రాజేష్ యాదవ్, అల్లంరాజు, గంగరాజు. సట్టకారి రవీంద్రపై మండల కేంద్రంలోనే కూటమి రౌడీలు దాడికి తెగబడ్డారు. వారు వెళ్తున్న కారుపై కర్రలతో దాడి చేశారు. కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది.
పెద్దముడియంలో..
పెద్దముడియం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా పోలీసులు ఒక్కొక్క ఎంపీటీసీ స్థానానికి ఒక్కొక్క సెట్ మాత్రమే అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు. నియోజకవర్గంలో కేవలం పెద్దముడియం మండలంలో పూర్తిగా 9 నామినేషన్లు వైఎస్సార్‌సీపీ తరఫున దాఖలయ్యాయి.


