వాల్మీకిపురం : స్థానిక సంస్థల ఎన్నికల్లో చివరి రోజు కూడా నామినేషన్ కూడా వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవికరాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. నామినేషన్ కేంద్రం వంద మీటర్లలోపే కూటమి నాయకులు వారి గూండాలతో ఉండడం చూస్తుంటే వారికి 144 సెక్షన్ అమలు కాదా అని ప్రశ్నించారు. నామినేషన్ కేంద్రం నుంచి వంద మీటర్ల వరకు టీడీపీ నేతలు విచ్చలవిడిగా తిరుగుతున్నా.. గుంపులుగా ఉన్నా వారికి ఈ యాక్ట్ వర్తించదా, వైఎస్సార్‌సీపీ వారికి మాత్రమే వర్తిస్తుందా అన్నారు. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతుంటే పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. ఉండేది రెండేళ్లే, వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను హెచ్చరించారు. అధికారం ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను కొట్టడం క్షమించరాని విషయమన్నారు. నామినేషన్ల స్వీకరణలో ఆన్‌లైన్ విధానం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆన్‌లైన్ విధానం ఉంటే ఈ దౌర్జన్యాలు జరిగేవి కావన్నారు. టీడీపీ గూండాలు రాళ్ల దాడులు చేస్తున్నా పోలీస్ యంత్రాంగం ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎవరు కొమ్ము కాస్తున్నారో వారందరి పేర్లు రాసిపెట్టుకోవడం జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారిపై తగిన విధంగా చర్యలు ఉంటాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు.
నామినేషన్ కేంద్రంలో యథేచ్ఛగా
హల్‌చల్
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి


