చింతకొమ్మదిన్నె : మండలంలోని బుగ్గవంక డ్యామ్ గేట్ల వద్ద గల నీటిలో గురువారం మధ్యాహ్నం పడటంతో సురేంద్ర (25) మృతి చెందగా, మరో ఇద్దరిని డ్యామ్ వాచ్ మాన్ కష్టపడి ప్రాణాలతో కాపాడారు. స్థానికులు, వాచ్‌మాన్ కథనం మేరకు.. కడప నగరానికి చెందిన ముగ్గురు యువకులు కారులో గురువారం మధ్యాహ్నం సమయంలో బుగ్గవంక డ్యామ్ ప్రాంతంలోకి వచ్చి మద్యం తాగినట్లు సమాచారం. అనంతరం డ్యామ్ గేట్ల సమీపంలోని నీటితొట్ల వద్ద కూర్చొని సెల్ఫీలు తీసుకొనే క్రమంలో.. పొరపాటున సురేంద్ర అనే యువకుడు నీటిలో పడగా అతడిని రక్షించేందుకు స్నేహితుడు నీటిలోకి దూకారు. వారిలో సురేంద్ర అనే యువకుడికి ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా.. మిగతా వారిలో ఈత వచ్చిన స్నేహితుడు ఒకరు తొట్టి అంచును పట్టుకొని సహాయం చేసేందుకు విఫలయత్నం చేశారు. నీటిలోని ఇరువురు పైన వున్న వ్యక్తి కాళ్లు ఆసరా కోసం పట్టుకోవడంతో పైన వున్న వ్యక్తి నీటిలోకి పడిపోయి కేకలు వేశారు. గమనించిన వాచ్‌మాన్ కృష్ణారెడ్డి వెంటనే స్పందించి నీటిలోని వారికి త్రాడును సహాయంగా వదిలి సమీప ప్రాంతంలోని వారిని సహాయం కోసం గట్టిగా అరిచారు. డ్యామ్ వీక్షణకు వచ్చిన సమీపంలోని వారి సాయంతో నీటిలో మునుగుతున్న ఇద్దరిని ప్రాణాలతో కాపాడగలిగారు. కాగా సురేంద్ర అనే యువకుడిని బయటకు తీయగా ఈత రాకపోవడంతో అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిసింది. చనిపోయిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.


