● వారంలో 407 మందిపై తప్పుడు కేసులు
● పోలీసుల అదుపులో 16 మంది
● వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్
పుంగనూరు : పుంగనూరులో తెలుగుదేశం గూండాలు చేసిన అరాచకాలకు బలైన వైఎస్సార్‌సీపీ నాయకులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆ పార్టీ నాయకులు, ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పతో సహా పలువురిపై హత్యాయత్నం తదితర తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. బుధవారం నామినేషన్ల కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించి, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేశారు. ఈ సంఘటనలో బాధితులైన నాయకులు 177 మందిపై స్థానిక పోలీసులు క్రైమ్ నంబరు 253/2026 గా కేసు నమోదు చేసి, స్వామి భక్తి చాటుకున్నారు. కాగా ఈ కేసుల్లో నిందితులుగా పేర్కొంటూ 16 మందిని బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో నిర్బంధించారు. గత వారం 16న జరిగిన మున్సిపల్ నామినేషన్లలో ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాప్రయత్నం చేశారు. తెలుగుదేశం గూండాలు వందల సంఖ్యలో రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన భద్రత సిబ్బందికి కాళ్లు, చేతులు విరిగగొట్టి చంపే ప్రయత్నం చేశారు. 10 వాహనాలను ధ్వంసం చేశారు. ఇంత జరిగినా పోలీసులు తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేయకుండా ఎంపీ మిథున్‌రెడ్డితో సహా 230 మందిపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ ఐదు తప్పుడు కేసులు కట్టారు. ఇందులో 407 మంది అమాయకులైన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదు చేశారు.
తప్పుడు కేసులకు వేదిక
తప్పుడు కేసులకు పుంగనూరు పోలీస్‌స్టేషన్ వేదికగా మారింది. గత వారం రోజులుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఐదు తప్పుడు కేసులు నమోదు చేయడం, అమాయక ప్రజలను జైలుకు పంపడం పలు విమర్శలకు తావిస్తోంది. తప్పుడు కేసులో సంబంధం లేని పీలేరు, కేవీ పల్లె, కలికిరి, కలకడ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను నిందితులుగా చూపుతూ అక్కడి తెలుగుదేశం నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు వారి మెప్పు పొందేందుకు పుంగనూరులో నిందితులుగా చూపడంపై జనం మండిపడుతున్నారు. ఇలాంటి తప్పుడు కేసుల్లో అమాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, రోజుల తరబడి స్టేషన్‌లో పెట్టుకుని రిమాండ్‌కు పంపకపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని పలువురు వాపోతున్నారు. పోలీసులపై వైఎస్సార్‌సీపీ నాయకులు కోర్టులో ప్రైవేటు కేసులు దాఖలు చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్‌కు, పోలీస్ ఉన్నతాధికారులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.


