చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.70.88 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆలయంలోని హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ.69,86,480, బంగారం 26.400 గ్రాములు, వెండి 315.510 గ్రాములు సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీ నోట్లతోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.53,053 లభించినట్లు తెలిపారు. అలాగే ఆలయం వద్ద ఉచిత అన్నదాన పథకం నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హుండీ ద్వారా రూ.48,985 సమకూరినట్లు చెప్పారు. ఈ ఆదాయం 60 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శశికుమార్, ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ
సజావుగా జరగాలి
రామసముద్రం : అన్నమయ్య జిల్లా ఎన్నికల పరిశీలకులు జి.బాలకృష్ణ గురువారం రామసముద్రం మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, అభ్యర్థులు స్వతంత్రంగా నామినేషన్‌లు వేసుకునేందుకు చర్యలు చేపట్టాలని సీఐ రవినాయక్, ఎస్‌ఐ హృషీకేశవ్‌రెడ్డిలకు సూచించారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని పేర్కొన్నారు.
సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ ఎంపికలు
మదనపల్లె సిటీ : స్థానిక బీటీ కాలేజీ మైదానంలో గురువారం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్– 2026–27 జిల్లా స్థాయి ఎంపికలు విజయవంతంగా జరిగినట్లు డీఎస్‌డీఏ చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర సివిల్ సర్వీసెస్ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను పలు విభాగాల్లో ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అర్హులైన రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంపికల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బెస్ట్‌ఫిజిక్, క్యారమ్స్, చెస్, క్రికెట్, పుట్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, లాన్‌టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా తదితర క్రీడా విభాగాల్లో నిర్వహించేందుకు ప్రతిపాదించారు. జిల్లా స్థాయి ఎంపికల్లో అర్హత సాధించిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గుంటూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపికల్లో పాల్గొంటారు.


