ప్రజాస్వామ్యమా... రౌడీ రాజ్యమా? | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యమా... రౌడీ రాజ్యమా?

Oct 23 2026 2:21 AM | Updated on Oct 23 2026 2:21 AM

● వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులు

● పట్టించుకోని పోలీసులు

● మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

వాల్మీకిపురం : ప్రజల్లోకి వెళ్తే ఓడిపోతామన్న భయం.. ఎన్నికలు పెడితే గెలవలేమన్న భయం.. వైఎస్సార్‌సీపీకి ప్రజల మద్దతు ఉండడంతో.. ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటూ పోలీసులను అడ్డంపెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతున్నారన్నారు. వంద మీటర్ల పరిధి కూటమి నాయకులకు లేదా అని ప్రశ్నించారు. నామినేషన్‌ కేంద్రం నుంచి వంద మీటర్ల వరకు టీడీపీ, కూటమి నాయకులు, గూండాలు అక్కడే ఉండి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తూ అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక రౌడీ రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నించారు. నామినేషన్‌ ఫారాలు నింపేందుకు కూడా వీలు లేకుండా తమ పార్టీ కార్యాలయానికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రానీయకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అడ్డుగోలుగా రాజకీయాలు చేస్తోందని, ఎన్నికల కమిషన్‌ చెబుతున్నా.. స్థానికంగా ఆ పరిస్థితి లేదన్నారు. రెండు రోజులుగా కూటమి నాయకులు 33 నామినేషన్లు దాఖలు చేశారని, వైఎస్సార్‌సీపీ నుంచి 3 నామినేషన్లు మాత్రమే వేయడం చూస్తుంటే స్థానికంగా ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. జిల్లా పోలీస్‌ యంత్రాంగం సైతం ఏమీ పట్టించుకోకుండా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తుండడం, అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ గూండాల అక్రమాలకు అడ్డుకట్ట వేసి, ఎన్నికల కమిషన్‌ స్పందించి పోలీస్‌ ఎస్కార్ట్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement