కడప కార్పొరేషన్ : అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న సత్యాన్ని అధికార పార్టీ నాయకులు, పోలీసులు గ్రహించాలని రాజంపేట ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. గురువారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయని, ఇంత ఘోరంగా ఎన్నికలు జరిపిన పరిస్థితి లేదన్నారు. రాయలసీమలో అధికార పార్టీ చేసిన సర్వేల్లో గెలవలేమని తెలిసిపోయిందని, అందుకే కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి జిల్లాలో పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయన్నారు. నామినేషన్లు వేయకుండా పోలీసులే అడ్డుకోవడం, టీడీపీ గూండాలు, రౌడీలను పెట్టి నామినేషన్లు చించేయడం, దాడులు చేయడం, స్క్రూట్నీ సమయంలో నామినేషన్లను తిరస్కరించడం వంటి చర్యల ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ఎక్కడిక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారని, టీడీపీ వారిని మాత్రం వందల మందిని నామినేషన్ కేంద్రాల వద్దకు అనుమతిస్తున్నారని, నామినేషన్ కేంద్రంలో కూడా వారే ఉన్నారన్నారు. ఇలా చేస్తే ప్రజాస్వామ్యానికి విలువేముందని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, టీడీపీ గూండాల దౌర్జన్యాలు, దాడుల వల్ల ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇదే జరిగితే ప్రజలు ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, కోలా కొండయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి


