●సమన్వయంతో వ్యవహరించండి
●రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, మదనపల్లె: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన స్థానిక ఎంపీ కార్యాలయంలో మదనపల్లె నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. నిమ్మనపల్లె, మదనపల్లె, రామసముద్రం మండలాల నుంచి తరలివచ్చిన మండల, గ్రామస్థాయి నాయకులు మిథున్ రెడ్డిని కలిశారు. తమ మండలాలు, గ్రామాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను మిథున్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు మమేకం కావాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలు వైఎస్సాఆర్‌సీపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీ శ్రేణులు అనుకూలంగా మలుచుకొని ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. పార్టీకి కార్యకర్తలు కీలకమని, వారితో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎవరైనా విజయం ముఖ్యమని, ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని కోరారు. మున్ముందు మంచి రోజులు వస్తాయని అన్నారు.
ముఖ్య నేతలతో సమీక్ష ..
అనంతరం మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. మండలంలో పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు సంబంధించిన అభ్యర్థులు, ఆశావహుల అంశంపై సమీక్షించారు. ఆయా మండలాల స్థితిగతుల ఆధారంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు సమన్వయంతో ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని, దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడై అభ్యర్థుల విజయం ఖాయమని సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


