సాక్షి ప్రతినిధి, కడప: కడప కార్పొరేషన్ కార్యాలయంలో ‘ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు’గా నివేదికలు పొందుపరుస్తున్నారు. డిఫాక్టో కమిషనర్‌గా అవతరించిన ఓ అధికారి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పింది చెప్పినట్లుగా తూచ తప్పకుండా పాటిస్తున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఇక్కట్లు చవిచూడాల్సి వస్తుందని సహచరులు హెచ్చరించినా అవేవి పట్టించుకునే స్థితిలో లేరు. పైగా అధికార పార్టీ నేతలకు చాడీలు చెబుతూ కార్పొరేషన్ ముఖ్య అధికారిని లోబర్చుకున్నారు. ఆపై ఫ్లానింగ్ విభాగంలో మరో అధికారితో జట్టుకట్టారు. వెరశి ఓటర్లు గణన మొదలు డివిజన్లు రిజర్వేషన్లు ఏకపక్షంగా చేపట్టుతున్నారు.
‘అధికారం ఉంది, మాకు అనువుగా డివిజన్ల రిజర్వేషన్లు కేటాయింపు చేపట్టాలి. మాకు అనువైన ప్రాంతంలో మా అభ్యర్థికి అనువుగా కేటాయింపులు చేపడతాం. అందుకు మీరంతా సహకరించాలి, మేము ఫలానా అధికారికి వివరాలు చెబుతాం, ఆయన చెప్పినట్లు మీరు ఆచరించండి.’ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కార్పొరేషన్ యంత్రాంగానికి ఇచ్చిన దిశా–నిర్దేశం చేశారు. ఆ మేరకు చట్టానికి వ్యతిరేకంగా డిఫాక్టో కమిషనర్‌గా అవతరించిన అధికారి తెలుగుతమ్ముళ్లకు అనువుగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు మిన్నంటాయి. ఈక్రమంలో పార్టీ ఫిరాయించిన తాజా మాజీ కార్పొరేటర్లు అందరికీ వారి వారి డివిజన్లలో ఎలాంటి మార్పులు లేకుండా రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన...
కడప నగరపాలక సంస్థ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీ కుల గణనకు సంబంధించిన ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా, 27వ తేదీ రాత్రి వరకూ ప్రకటించలేదు. 28వ తేదీ సాయంత్రంలోపు అభ్యంతరాలు ఇవ్వమని కోరారు. ఎలా సాధ్యమని రాజకీయ పక్షాలు వాపోతున్నాయి. ఓటర్ల జాబితా, కులగణన ఇవన్నీ పారదర్శకంగా చేపట్టాల్సి ఉండగా ఆలా చేయాలనే ఆలోచన కూడా కార్పొరేషన్ అధికారులకు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. విస్తరించిన డివిజన్లు ప్రకారం 51వ డివిజన్ (మరియాపురం ఏరియా) ఎస్సీ ఓటర్లు సుమారు 16వందల మందికి పైగా ఉన్నారు. ఎటుతిరిగి ఆ డివిజన్ ఎస్సీకి రిజర్వుడ్ కావాల్సి ఉంది. టీడీపీ కోరిక మేరకు ఆ డివిజన్ ఓసీకి కేటాయించినట్లు సమాచారం. ఆమేరకు డివిజన్ల రిజర్వేషన్లు ప్రకటించకమునుపే అక్కడి టీడీపీ నేత అధికార పార్టీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం విశేషం. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుగా గెలుపొంది, 11 మంది తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వారు ఆశించినట్లుగానే అనువుగా రిజర్వేషన్లు కేటాయింపులు చేపట్టినట్లు సమాచారం. ఆమేరకు ఫిరాయింపుదారులందరికీ ఆయా డివిజన్లు బెర్త్‌లు కన్ఫర్మ్ అయినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా డిఫాక్టో కమిషనర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు టీడీపీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తూ కార్పొరేషన్ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడపంలో డిఫాక్టో కమీషనర్ సఫలీకృతులయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
కుల గణన తారుమారు..
నగరపాలక సంస్థ అధికారులు చేపట్టిన కుల గణనలో నగర వాసుల కులాలు తారుమారు అయ్యాయి. ఓసీలు బీసీలుగాను, బీసీలు ఎస్సీలుగాను, ఎస్సీలు బీసీలుగాను గుర్తించబడ్డారు. అదెలాగంటారా... మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల వార్డుల పునర్విభజన చేపట్టారు. దాని తర్వాత కులగణన చేపట్టి వార్డుల రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. ఇంటింటికీ వెళ్లి కుల గణన చేయాల్సిన అధికారులు కార్యాలయాల్లో కూర్చొని పేర్లను బట్టి వారి కులాన్ని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ తప్పుడు విధానం కారణంగా వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియలో కోరుకున్న వారికి కోరుకున్న డివిజన్ అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో రాజకీయ పార్టీలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా, తప్పులు బహిర్గతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కులగణన రహస్యంగా ఉంచారని సమాచారం.
కార్పొరేషన్‌లో డివిజన్ల
రిజర్వేషన్లలో గోల్‌మాల్
పార్టీ ఫిరాయించిన 11మంది
కార్పొరేటర్ల బెర్త్ కన్ఫర్మ్
తెలుగుతమ్ముళ్లు కోరుకున్న
రిజర్వేషన్ కేటాయింపు
ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్నాసరే
రిజర్వేషన్ తారుమారు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న
ఆ ముగ్గురు అధికారులు


