సాక్షి, మదనపల్లె: మదనపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు, అచ్చన్నాయుడు, బీసీ.జనార్దనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, వస్తున్నారు..మదనపల్లెకు మహర్దశ పడుతుంది, అభివృద్ధికి ఇతోధికంగా నిధులు ప్రకటిస్తారు, సమస్యలు పరిష్కరించడానికి హామీ ఇస్తారని ఎదురుచూసిన మదనపల్లె ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించిన నేతలు, జిల్లాకు, మదనపల్లెకు ఏం చేస్తున్నామో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క మాట చెప్పిన పాపాన పోలేదు. మా మదనపల్లెకువచ్చారు, వరాలు ఇస్తారు అని ఎదురుచూసిన ప్రజలకు నిరాశ మిగిలింది. మున్సిపల్, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కనీసం ఏదో ఒక వరం అయినా ప్రకటిస్తారని ఆశిస్తే చివరకు పైసా ప్రకటన లేకుండానే వెనుతిరిగి వెళ్లారు.
చరిత్ర చెప్పి సరిపెట్టారు
సభలో పాల్గొన్న ముఖ్యనేతలంతా మదనపల్లె గొప్పతనం, చరిత్ర గురించి చెప్పారు. ఇక్కడ సభ సందర్భంగా పట్టణ, నియోజకవర్గ ప్రజలకు అందించాల్సిన అభివృద్ధి, సమస్యల పరిష్కారం గురించి ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మదనపల్లె మెడికల్ కళాశాల, కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణాలు, టమోటా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి సమస్య, జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి ప్రభుత్వం అభివృద్ధిపై ఒక్క ప్రకటన లేదు. పట్టణ రహదారుల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, జిల్లా కేంద్ర కార్యాలయాలకు స్థలాలు, భవనాలు లేక అవస్థలు పడుతున్నారు. మదనపల్లె కేంద్రమైనప్పటికీ సగం కార్యాలయాలు ఇంకా రాయచోటిలోనే కొనసాగుతున్నాయి. మదనపల్లెకు ఔటర్ రింగ్ రోడ్డుపై స్పందించలేదు. అభివృద్ధి ప్రణాళిక ప్రకటించలేదు, అభివృద్ధికి నిధులు ఇస్తున్నట్టు మాట మాత్రంగానైనా చెప్పలేదు. జిల్లాలో నెలకొన్న సమస్యలు, జగనన్న పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం రాగానే ఆపివేసింది. అలాగే ముదివేడు, ఆవులపల్లె, నేతికుంటపల్లె రిజర్వాయర్ల పనులు అర్ధాంతరంగా ఆగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీని ఊసెత్త లేదు. కరువు రైతులకు కల్పతరువు అయిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల అనుసంధాన పనులను చంద్రబాబు ఆపివేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఎంతో ప్రయోజనమైన ఈ పనులు నిలిపివేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఈ ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారని ఆశించిన రైతాంగానికి నిరాశ మిగిలింది. ప్రసంగంలో తాను ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసినని చెప్పుకున్న చంద్రబాబు ఆ జిల్లా కోసం ఒక్క అభివృద్ధి పని కూడా ప్రకటించలేదు. బిటి కళాశాలను జగనన్న పాలనలో విశ్వవిద్యాలయం చేశారు. దీన్ని కొనసాగించి విశ్వవిద్యాలయంగా అభివృద్ది చేయాలని విద్యావేత్తలు, విద్యార్థులు కోరుతున్నారు, ఈ విషయాన్నే మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బీటీ కాలేజీని విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన విషయాన్ని మరచిపోయారు.
కరువుపై మాట కరువు
జిల్లాలోని 25 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నట్టు ప్రభుత్వమే ప్రకటించింది. అలాంటి జిల్లాలో పర్యటించిన సీఎం, కేంద్ర మంత్రి, మంత్రులు కరువు జిల్లాపై కనికరం చూపలేదు. కరువు రైతులకు ఉపశమన చర్యలు, ఆదుకునేందుకు పరిహారం, ప్రత్యామ్నాయ చర్యలపై కనీసం భరోసా ఇవ్వలేదు. .
● తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కరువు తాండవిస్తోందని జిల్లా మొత్తాన్ని ప్రభుత్వమే కరువు జిల్లాగా ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో మదనపల్లె సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూగర్భ జలమట్టం 3.6 మీటర్లు పైకి పెరిగినట్టు చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో భూగర్భ జల మట్టాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. వ్యవసాయ బోర్లు ఆగిపోతూ పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నప్పడు భూగర్భజల మట్టం పెరగడం ప్రశ్నార్థకమే.
తాను కృష్ణా జలాలు ఇవ్వకపోతే మదనపల్లె ఈపాటికే వలస పోయేదని చంద్రబాబు ప్రసంగంలో చెప్పుకున్నారు. ఇక్కడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీళ్లు ఇవ్వాలని గత సీజన్లో కనీసం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు కొద్దిపాటి నీటిని చిప్పిలి ట్యాంకుకు మళ్లించి..తానే నీళ్లు ఇచ్చానని, లేకపోతే వలసలు వెళ్లే వారిని చెప్పుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. మదనపల్లె ప్రజలు ఇప్పటికి వారం నుంచి పది రోజులు ఒకసారి తాగునీటిని పొందుతున్నారు. ఈ నీళ్లు కూడా కుటుంబాల రోజూవారి అవసరాలకు సరిపోవడం లేదు. ఈ విషయాన్ని విస్మరించి మదనపల్లెకి నీళ్లు ఇచ్చి ఆదుకున్నట్టు గొప్పలు చెప్పుకున్నారు.


