కేవీపల్లె : ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం చెందిన సంఘటన కేవీపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. మండలంలోని గర్నిమిట్టకు చెందిన షేక్ మోదీన్‌బాషా(14), ఆర్.సాయిచరణ్ (14) శుక్రవారం గర్నిమిట్ట నుంచి ద్విచక్రవాహనంలో కేవీపల్లె వైపు బయలుదేరారు. కేవీపల్లె వద్ద అదే సమయంలో కేవీపల్లెకు చెందిన దొడ్డి శ్రీరాములు(42) ద్విచక్రవాహనంలో ఎదురుగా వచ్చారు. వీరి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మోదీన్‌బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిచరణ్, దొడ్డి శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన మోదీన్‌బాషా కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఆపూస్మ సంఘ సభ్య పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించనున్నట్లు ఆపూస్మ జిల్లా అధ్యక్షుడు గంగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లుగా ఆపూస్మా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా 200 మంది ఉపాధ్యాయులను సత్కరిస్తున్నట్లు తెలిపారు.


