మదనపల్లె టౌన్: అక్టోబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు వీఐపీలు మదనపల్లెకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రకాలనీ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభా స్థలిని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం పరిశీలించారు. సభా వేదిక, వీఐపీల రాకపోకల మార్గా లు, పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేసిన ఆయన.. సభా ప్రాంగణం వద్ద ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఎస్పీలు బుచ్చిరాజు, ఏడుకొండల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు
మదనపల్లె సిటీ: పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ డాక్టర్ అనూరాధ తెలిపారు. జిల్లాలోని 1,785 ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలలు, 7 ఎయిడెడ్ పాఠశాలల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. అలాగే 473 ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఉదయం 7 నుంచి 1 గంట వరకు జరుగుతాయన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. 3 గంటలకు నూతన కమిటీ సమావేశం జరుగుతుందన్నారు.


