కొలువు సాధించి... కల నెరవేర్చి! | - | Sakshi
Sakshi News home page

కొలువు సాధించి... కల నెరవేర్చి!

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

కొలువు సాధించి... కల నెరవేర్చి!

● చిరు వ్యాపారి కుమార్తె

షేక్‌ ఆయేషా అద్భుత ప్రగతి

● తొలి ప్రయత్నం విఫలమైనా

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం

● గ్రూప్‌–1లో టాప్‌ ర్యాంక్‌ సాధించి

డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక

● ప్రస్తుతం అమలాపురం ఆర్డీవోగా

సేవలందిస్తున్న మదనపల్లె ముద్దుబిడ్డ

మదనపల్లె సిటీ: ‘కష్టాలు చదువుకు అడ్డంకి కాదు.. పట్టుదల ఉంటే ఆకాశమే హద్ద్ఙు అని నిరూపించింది మదనపల్లె పట్టణానికి చెందిన షేక్‌ ఆయేషా. రెక్కాడితే గాని డొక్కాడని ఒక సామాన్య చిరు వ్యాపారి ఇంట్లో పుట్టి, నేడు సమాజంలో అత్యున్నతమైన గ్రూప్‌–1 అధికారిణిగా ఎదిగి.. తల్లిదండ్రులు కన్న కలలను, వారి నిరంతర శ్రమను సార్థకం చేసింది.

ఎన్ని కష్టాలు ఎదురైనా.. చదువే ఆయుధంగా

మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన షేక్‌ అహ్మద్‌బాషా, షేక్‌ గౌసియా బేగంల ఏకై క కుమార్తె ఈ షేక్‌ ఆయేషా. తండ్రి అహ్మద్‌బాషా ఒక సామాన్య చిరు వ్యాపారి కాగా, తల్లి గృహిణి. కుమార్తెను సమాజంలో ఒక ఉన్నతమైన అధికారిణిగా చూడాలన్నదే ఆ తండ్రి జీవిత ఆశయం. ఇందుకోసం తాను ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డా, కుమార్తె చదువుకు ఎక్కడా లోటు రాకుండా అన్ని తానై చూసుకున్నాడు. తండ్రి కష్టాన్ని కళ్లారా చూసిన ఆయేషా.. చదువులోనే రాణించడమే తాను తల్లిదండ్రులకు ఇచ్చే పెద్ద బహుమతిగా భావించింది. స్థానికంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన అనంతరం, తమిళనాడు తంజావూరులోని ప్రసిద్ధ శస్త్ర యూనివర్సిటీలో బీటెక్‌ విజయవంతంగా పూర్తి చేసింది.

ఓటమిని గెలుపుగా మార్చిన వైనం

బీటెక్‌ పూర్తయిన తర్వాత సివిల్స్‌, గ్రూప్స్‌ వైపు వెళ్లాలని ఆయేషా గట్టిగా నిర్ణయించుకుంది. దీనికి తల్లిదండ్రులు కూడా పూర్తి ప్రోత్సాహం అందించారు. మొదటిసారిగా 2018లో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో ఎంతో కష్టపడి పరీక్ష రాసింది. అయితే తొలి ప్రయత్నంలో అనుకున్న ర్యాంకు రాకపోవడంతో ఆయేషా కొంత నిరాశకు గురైనా, తల్లిదండ్రులు ఆమెకు వెన్నుతట్టి ‘నువ్వు సాధించగలవు’ అంటూ మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ నమ్మకమే పెట్టుబడిగా మరింత పట్టుదలతో శ్రమించిన ఆమె, 2022 గ్రూప్‌–1 పరీక్షలో అద్భుతమైన ఉత్తీర్ణత సాధించి ఏకంగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై ంది. చిరు వ్యాపారి కుమార్తె నుంచి సివిల్‌ అధికారిణిగా ఎదిగిన షేక్‌ ఆయేషా ప్రస్తుతం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆర్డీవోగా బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుద్యోగ యువతకు రోల్‌ మోడల్‌గా నిలిచింది.

తల్లిదండ్రులే కొండంత అండ–షేక్‌ ఆయేషా

‘గ్రూప్స్‌ ప్రిపరేషన్‌లో నా తల్లిదండ్రులు నాకు కొండంత అండగా నిలబడ్డారు. నా సక్సెస్‌లో వారి ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఏ సమయంలోనైనా నేను ఒత్తిడికి గురైతే.. వారు నన్ను ఎప్పటికప్పుడు వెన్నుతట్టి నాలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ విజయం నా తల్లిదండ్రుల శ్రమకు దక్కిన గౌరవం.’

తన కలే మా కల: షేక్‌ అహ్మద్‌బాషా, గౌసియాబేగం (తల్లిదండ్రులు)

‘ఆయేషా చిన్నప్పటి నుంచి సివిల్స్‌లో రాణించడమే లక్ష్యంగా ఎంచుకుంది. అందుకోసం తను రాత్రింబగళ్లు నిరంతరం శ్రమించింది. తన కలను మా కలగా మార్చుకుని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆమెకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించాం. ఈ రోజు తన స్వప్నం సాకారమై ఒక ఉన్నతమైన అధికారిణిగా దేశానికి సేవ చేస్తుండటం తల్లిదండ్రులుగా మాకు గర్వంగా, ఆనందంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement