సాక్షి, మదనపల్లె: ‘మా నాన్న కే.శంకర్రావు నాతో లేకపోయినా, ఆయన నా గుండెల్లో నింపిన ఆశయమే నన్ను ఈ రోజు మున్సిపల్ కమిషనర్‌గా నిలబెట్టింది’ అని మదనపల్లె మున్సిపల్ కమిషనర్ కే.ప్రమీల గర్వంగా ప్రకటించారు. గుంటూరు ప్రభుత్వ కార్యాలయంలో ఒక సాధారణ ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తూ.. భార్య, ముగ్గురు కుమార్తెలను ఎంతో బాధ్యతగా పోషించిన ఒక సామాన్య తండ్రి కన్న కలలను, ఆయన కుమార్తె నిజం చేసిన స్ఫూర్తిగాథ ఇది.
డిగ్రీలోనే దూరమైన నాన్న..
శంకర్రావు గారు బతికున్నంత కాలం తన కుమార్తె ను ఉన్నత చదువులు చదివించాలని, సమాజంలో ఒక ఉన్నతమైన ఆఫీసర్‌గా చూడాలని నిరంతరం ప్రోత్సహిస్తూ మార్గదర్శనం చేసేవారు. అయితే, ప్రమీల 18 ఏళ్ల వయసులో, డిగ్రీ చదువుతున్న తరుణంలోనే తండ్రి అకాల మరణం చెందారు. ఒక్కసారిగా కుటుంబంపై కొండంత భారం పడినా, నాన్న చెప్పిన మాటలు ఆమెను నిలబెట్టాయి.
పట్టుబట్టి ..తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలో విజయం సాధించి సీనియర్ ఆడిట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించారు. అయితే, ఆ ఉద్యోగం నాన్న ఆశించిన స్థాయిది కాకపోవడంతో ఆమె సంతృప్తి చెందలేదు. ఎలాగైనా నాన్న కోరుకున్న ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉద్యోగం చేస్తూనే మళ్లీ చదివారు. ఫలితంగా, 2012 గ్రూప్–2 పరీక్షల్లో అద్భుత విజయం సాధించి, నేరుగా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నత హోదాలో సేవలందిస్తున్నారు.


