● ఒకరు న్యాయమూర్తి..
ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు!
● ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత స్థానాల
వైపు ముగ్గురు సోదరీమణుల ప్రస్థానం
పుంగనూరు: కొడుకులు పుడతారని అనుకున్నారు.. కానీ విధి ముగ్గురూ ఆడపిల్లలనే ప్రసాదించింది. చాలా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి వస్తే నిరాశ చెందుతారు, ఆడపిల్లల చదువులను భారంగా భావిస్తారు. కానీ, ఆ తల్లిదండ్రులు మాత్రం కృంగిపోలేదు, భయపడలేదు. ఆడపిల్లలే తమ సర్వస్వం అనుకుంటూ పట్టుదలతో చదివించారు. కన్నవారి నమ్మకాన్ని నిలబెడుతూ ఆ ముగ్గురు కుమార్తెలూ నేడు సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. పుంగనూరు పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది పిడతల నరసింహ బాలాజికుమార్, సత్యవతి దంపతుల ముగ్గురు కుమార్తెల స్ఫూర్తిదాయక సాహస గాథ ఇది.
ఇద్దరు సాఫ్ట్‌వేర్లు.. ఒకరు న్యాయమూర్తి
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముగ్గురు కుమార్తెలు విద్యా రంగంలో అద్భుతాలు సృష్టించారు
పెద్ద కుమార్తె (లక్ష్మీమాధవి): ఎమ్‌ఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి, ప్రస్తుతం బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు.
రెండవ కుమార్తె (భార్గవి): ఎమ్‌ఎస్సీ ఫిజిక్స్, బీఈడీ చదివి, ఈమె కూడా బెంగళూరులోనే సాఫ్ట్‌వేర్ రంగంలో రాణిస్తున్నారు.
మూడవ కుమార్తె (మీనాక్షి సుందరి): తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి లా కోర్సు పూర్తి చేశారు. హైకోర్టు నిర్వహించిన ప్రిన్సి పల్ జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.ప్రస్తుతం తిరుపతి జిల్లా నాయుడుపేటలో సివిల్ జడ్జిగా అత్యున్నత సేవలు అందిస్తున్నారు. ఈ ముగ్గురు సోదరీమణుల విజయప్రస్థానం ఆడపిల్లలను ఉన్నతంగా చదివించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప స్ఫూర్తి!


