కురబలకోట: ఒకప్పుడు ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావాలనే ఆలోచనలు ఉండేవి. కానీ, తండ్రి అందించే వెన్నుదన్ను తోడైతే ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగగలరని నిరూపిస్తున్నా రు కురబలకోట మండలం కనసానివారిపల్లికి చెందిన పవిత్ర రెడ్డి కనసాని. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె, పట్టుదలతో చదివి నేడు ఉన్నతమైన వైద్యురాలిగా రాణిస్తున్నారు. ఆమె తండ్రి ఆర్కే కృష్ణారెడ్డి కనసానివారిపల్లి గ్రామానికి తొలి సర్పంచ్‌గా సేవలందించారు. ఆయన తన కుమార్తెకు చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో, పవిత్ర తిరుపతిలోని ప్రతిష్టాత్మక శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఆ తర్వాత గదగ్‌లోని జీఐఎంఎస్ లో పీజీ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం పవిత్ర రెడ్డి బెంగళూరులోని ప్రముఖ సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ (కిడ్నీ విభాగం) డాక్టర్‌గా మొదటి ఏడాది విధులు నిర్వహిస్తున్నారు. తన చదువు సాఫీగా సాగడానికి తండ్రి ప్రోత్సాహమే కారణమని ఆమె కృతజ్ఞతతో చెబుతున్నారు. కేవలం పవిత్ర మాత్రమే కాకుండా, ఆమె తమ్ముడు గణేష్ కూడా ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నారు.


